Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

రాజధాని రైతులకు ‘వీధిపోటు’ ఊరట

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. ఈ భేటీలో మొత్తం 35 అజెండా అంశాలపై చర్చించిన కేబినెట్, రాష్ట్ర అభివృద్ధి , ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఇచ్చిన నివేదికపై మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన కేబినెట్, అధికారిక నివేదిక పూర్తిగా అందిన తర్వాతే దీనిపై మంత్రులు స్పందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
రాజధాని అమరావతి పరిధిలోని రైతులు , నిరుపేదల సమస్యల పరిష్కారానికి కేబినెట్ ప్రాధాన్యతనిచ్చింది. అమరావతి పరిధిలో వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఏపీ టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టుల పూర్తి కోసం హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది.
వైద్యం , విద్యారంగంలో సంస్కరణల దిశగా పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్రీడలను ప్రోత్సహించే క్రమంలో భాగంగా అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖకు విశాఖపట్నంలో 500 చదరపు గజాల స్థలంతో పాటు, గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక రంగ అభివృద్ధి కోసం అల్లూరి జిల్లా నందకోటలో ఫైవ్‌స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ , థీమ్ పార్క్ ఏర్పాటుకు భూకేటాయింపులు చేపట్టింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పలు పోస్టుల అప్‌గ్రేడ్ , వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదముద్ర వేసింది.
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పలు జలవనరులు , ఇంధన శాఖ ప్రాజెక్టులకు ఆర్థిక , పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామం ప్రాజెక్టుల కోసం గతంలో జారీ చేసిన పాత అనుమతులను రద్దు చేసి, కొత్తగా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లను ఆహ్వానించాలని నిర్ణయించింది. పలమనేరులో లైవ్‌స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు, ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని మార్కెట్ కమిటీకి బదిలీ చేసే అంశాలపై కూడా కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాలనను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.