NationalNews

అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే

Share with

మొన్న ఇండియా టీవీ…
నేడు ఇండియా టుడే
సర్వే ఏదైనా అవే ఫలితాలు

తెలంగాణలో రాజకీయ స్థితిగతులపై ఆరా సర్వే సంస్థ అంచనాలను నిజం చేస్తూ జాతీయ సర్వే సంస్థలు ఫలితాలు ఒక్కొక్కటి విడుదలవుతున్నాయ్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీజేపీ 6 ,కాంగ్రెస్ 3, మజ్లిస్ 1, టీఆర్ఎస్ 7 స్థానాల్లోనూ విజయం సాధిస్తాయని ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అభిప్రాయపడింది. తెలంగాణలో మారుతున్న ప్రజాభిప్రాయాన్ని మరో సర్వే పసిగట్టింది. మొన్న ఆరా సర్వే సంస్థ, నిన్న ఇండియా టీవీ సర్వే, ఇప్పుడు ఇండియా టుడే సర్వే… ఏదైనా కానివ్వండి ఫలితాలు మాత్రం ఓకేలా వస్తున్నాయని తేలిపోతోంది. తెలంగాణ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 8, బీజేపీ 6, కాంగ్రెస్ 2, మజ్లిస్ ఒక్క ఎంపీ స్థానంలో గెలుస్తాయని గత నెలలో ఇండియా టీవీ సర్వే పేర్కొంది. ఇండియా టీవీ వెల్లడించిన సర్వే ఫలితాల తరహాలోనే తాజాగా ఇండియా టుడే, సీఓటర్ సర్వే సర్వే రావడం విశేషం.

(Courtesy- India Today)

జులై 13న ఆరా సర్వే సంస్థ మూడ్ ఆఫ్ తెలంగాణ ఫలితాలను వెల్లడించి.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ భారీగా పుంజుకుంటుందని సర్వే తేల్చింది. టీఆర్ఎస్ పార్టీ 38.88 శాతం, బీజేపీ 30.48 శాతం, కాంగ్రెస్ 23.71 శాతం ఓట్లను తెలంగాణలో పొందుతాయని ఆరా సర్వే అభిప్రాయపడింది. ఆరా సర్వే సంస్థ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం మొదలయ్యింది. ‘ఆరా’ సర్వేను పట్టించుకోవాల్సిన పనిలేదంటూ పీసీసీ చీఫ్‌తో సహా కాంగ్రెస్ నాయకగణం తూర్పారబట్టింది. టీవీ చర్చా వేదికల్లో విమర్శలుగుప్పించింది. కానీ ఆరా సంస్థ మాత్రం ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఫలితాల ఇలాగే ఉంటాయని కుండబద్ధలుకొట్టింది.

ఆరా సర్వే ఫలితాలు, జాతీయ స్థాయి సర్వే సంస్థల ఫలితాలతో సరిపోలడంతో కాంగ్రెస్ ఏమంటుందో చూడాలి. నెల రోజుల్లో రెండు జాతీయ సర్వేలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాయ్. ఇండియా టీవీ, ఇండియూ టుడే రెండు సంస్థలు కూడా ఆరా సర్వే తరహాలోనే ఫలితాలు విడుదల చేశాయ్. తెలంగాణలో టీఆర్ఎస్ నెంబర్ వన్ పార్టీగా ఉన్నప్పటికీ రోజు రోజుకు బలం తగ్గుతుందని… బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోందని సర్వేలు తేల్చాయ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతోందని మూడు సర్వేలు ఒకే అభిప్రాయాన్ని వెల్లడించాయ్.

Courtesy- India Today

దేశ వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… ఎన్డీఏ పక్షాలు 307 స్థానాల్లో గెలుస్తాయని, యూపీఏ పక్షాలు 125 స్థానాల్లోనూ, ఇతరులు 111 స్థానాల్లోనూ విజయం సాధిస్తారని ఇండియా టుడే సర్వే తేల్చింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 18, టీడీపీ 7 స్థానాల్లో గెలుస్తాయని సర్వే విశ్లేషించింది. కానీ బీహార్, మహారాష్ట్రలో విపక్షాలు బలం పుంజుకుంటాయంది. నితీష్ ఫ్యాక్టర్, ఉద్ధవ్ థాక్రే ఫ్యాక్టర్ బీజేపీకి ఇబ్బంది కలిగిస్తాయని సర్వే అభిప్రాయపడింది. బీహార్‌లో ఎన్డీఏ పక్షాలు 14 గెలుకుంటే, యూపీఏ పక్షాలు 26 స్థానాల్లో విజయం సాధిస్తాయంది. బీహార్ లో నితీష్ సర్కారు ఏర్పాటుతో ఫలితాలు మారతాయని సర్వే తెలిపింది. ఎన్డీఏ 286, యూపీఏ 146 స్థానాల్లో గెలుస్తాయని వివరించింది. నితీష్, బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో 21 సీట్లు తగ్గుతాయంది.

Courtesy- India Today

ఇక మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయని ఇండియా టుడే సర్వే అభిప్రాయపడింది. మహారాష్ట్రలోనూ ఎన్డీఏపై యూపీఏ కూమిటి పైచేయి సాధిస్తోందని పేర్కొంది. ఎన్డీఏ పక్షాలు 18 స్థానాల్లో గెలిస్తే, యూపీఏ పక్షాలు 30 చోట్ల గెలిచే ఛాన్స్ ఉందంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ 35 చోట్ల విజయం సాధిస్తే, బీజేపీ 7 స్థానాల్లో గెలుస్తాయంది. కర్నాటకలో ఎన్డీఏ, యూపీఏ చెరి 13 స్థానాలు గెలుచుకుంటే ఇతరులు 2 స్థానాల్లో గెలుస్తారంది. దేశవ్యాప్తంగా మోదీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అటు ఇండియా టీవీ, ఇటు ఇండియా టుడే సర్వేలు తేల్చి చెప్పడంతో దేశ రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోంది.