Home Page SliderNationalNewsNews AlertTrending Today

ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలతో మార్కండేయన్ అరెస్ట్

చెన్నై: తమిళనాడులో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో డీఎంకే ఎమ్మెల్యే జి.ఆర్. మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇటీవల నిర్వహించిన ఓ బహిరంగ సభలో అసెంబ్లీలో విజయ్‌ను ఉద్దేశించి మార్కండేయన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు బెదిరింపు స్వరూపంలో ఉన్నాయని పేర్కొంటూ టీవీకే నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, మార్కండేయన్‌ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని విచారణ కోసం తూత్తుకుడి ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

అరెస్టు సమయంలో తాను ఎమ్మెల్యేనని, స్పీకర్ అనుమతి లేకుండా అరెస్టు చేయరాదని మార్కండేయన్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు చేపట్టారు. ఆయన అరెస్టు విషయం తెలిసిన వెంటనే డీఎంకే కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనలు చేపట్టారు.

ఇటీవల మరో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ కూడా ఇలాంటి కేసులో అరెస్టయ్యారు. అనంతరం ఆయనకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. మార్కండేయన్ అరెస్టును డీఎంకే తీవ్రంగా ఖండించింది. అధికార పార్టీ రాజకీయ కక్షతో తమ నాయకులపై కేసులు నమోదు చేస్తోందని, ప్రజాస్వామ్యబద్ధమైన విమర్శలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది. ఈ ఘటనతో టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.