Andhra PradeshBreaking NewsHome Page SliderNationalNewsNews Alert

ఏపీ శాంతిభద్రతలపై లోక్‌సభలో గురుమూర్తి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందంటూ తిరుపతి లోక్‌సభ సభ్యుడు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసుల వేధింపులు, లాకప్ మరణాలు, మహిళలు, దళితులపై దాడులు, రాజకీయ హింస పెరుగుతున్నాయని ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కృష్ణా, నెల్లూరు, కర్నూలు, పిడుగురాళ్ల ప్రాంతాల్లో పోలీసుల వేధింపులతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురి మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలు పోలీసుల జవాబుదారీతనం, ప్రజల ప్రాణ భద్రతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. అయితే, సభలో విపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా వాయిదా తీర్మానంపై చర్చ జరగలేదని తెలిపారు.

జూన్ 2024 నుంచి మార్చి 2026 వరకు రాష్ట్రంలో మహిళలపై 209 నేరాలు నమోదయ్యాయని, ఇందులో అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు, అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలు ఉన్నాయని వివరించారు. అలాగే దళితులపై 69, రాజకీయ హింసకు సంబంధించిన 133 ఘటనలు నమోదైనట్లు చెప్పారు.

ఈ పరిస్థితులు రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని పేర్కొన్న ఎంపీ, అన్ని ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.