Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

జీవో 396 రద్దుకు సమ్మె

చిలకలూరుపేట: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 396 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు పది రోజుల పాటు ‘పెన్‌డౌన్’ సమ్మె ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన ఈ నిరసన జులై 31 వరకు కొనసాగనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. సమ్మె ప్రభావంతో చిలకలూరుపేట సబ్- రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

ఈ సందర్భంగా సంఘం కోశాధికారి ఎ.సత్యనారాయణ మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌కే సేవా కేంద్రాల ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించే ప్రభుత్వ నిర్ణయం ప్రజల భూములు, స్థిరాస్తుల భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల రికార్డుల్లో అవకతవకలకు అవకాశం ఉంటుందని, ప్రజల ఆస్తి హక్కులపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

జీవో 396 తో తమ ఉపాధికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రజల భూములు, ఆస్తి హక్కుల పరిరక్షణ కోసమే ఈ ఉద్యమం చేపట్టామని, తమ నిరసనకు ప్రజలు సహకరించాలని దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్ల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది.