ఆధార్ యాప్‌కు 4 కోట్ల డౌన్‌లోడ్స్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ యాప్ డిజిటల్ సేవల విస్తరణలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ యాప్‌ను ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా ప్రజలు డౌన్‌లోడ్ చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందిన ఈ యాప్ ద్వారా ఆధార్ సేవలు మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ నంబర్, చిరునామా, ఈ-మెయిల్ అప్‌డేట్ చేయడం, ఈ- ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ లాక్/ అన్‌లాక్ వంటి సేవలను ఇంటి నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా పూర్తి చేసుకునే అవకాశం కల్పించింది.
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, యాప్ ద్వారా ఇప్పటివరకు 49 లక్షల మంది మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసుకున్నారు. అలాగే 11.65 లక్షల మంది చిరునామా వివరాలను మార్చుకోగా, 12.5 లక్షల మంది ఈ- మెయిల్ వివరాలను నమోదు లేదా అప్‌డేట్ చేసుకున్నారు.
సైబర్ భద్రతపై పెరుగుతున్న అవగాహనతో వినియోగదారులు బయోమెట్రిక్ లాక్/ అన్‌లాక్ సేవలను కూడా పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ఈ ఫీచర్‌ను ఇప్పటివరకు 1.91 కోట్లకు పైగా సార్లు ఉపయోగించినట్లు కేంద్రం తెలిపింది.
ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన డిజిటల్ సేవలను అందించడంలో ఆధార్ యాప్ కీలక పాత్ర పోషిస్తోందని, భవిష్యత్తులో మరిన్ని సేవలను ఇందులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.

