Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మరు: కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారనున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ భవన్‌లో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మల్లారెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాలపై స్పందించిన కేటీఆర్, “మునిగే పడవ లాంటి కాంగ్రెస్‌లోకి తెలిసి తెలిసి ఎవరైనా వెళ్తారా?” అని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన రాజకీయ పరిస్థితి దయనీయంగా మారిందని, తాను ఏ పార్టీలో ఉన్నానో కూడా చెప్పుకోలేని స్థితికి చేరారని ఎద్దేవా చేశారు.

యాదగిరిగుట్ట సాక్షిగా కేసీఆర్‌తోనే ఉంటానని ప్రమాణం చేసిన పోచారం చివరకు మాట తప్పారని కేటీఆర్ ఆరోపించారు. భవిష్యత్ ఎన్నికల్లో బాన్సువాడలో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏదీ జరగలేదని, హామీలు, ప్రమాణాలకే ప్రభుత్వం పరిమితమైందని ఆరోపించారు. రైతులకు యూరియా అందుబాటులో లేకపోయినా ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కూడా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ఎల్ నినో’ ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కు చేరుతున్నా ప్రభుత్వం ఆలస్యంగా స్పందిస్తోందని, ముందుచూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని కేటీఆర్ ఆరోపించారు.