టీచర్‌పై లైంగిక దాడి కేసు
విజయవాడ: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతిపై మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిమ్ ట్రైనర్ కోసం విజయవాడ పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అబ్దుల్ ఖాదర్ అనే జిమ్ ట్రైనర్ సోషల్ మీడియా ద్వారా ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఆమె అధిక బరువు తగ్గించాలని కోరుకోవడంతో, ప్రత్యేక డైట్ ప్లాన్, ఫిట్‌నెస్ సూచనలు ఇస్తానని నమ్మించి నగరంలోని ఓ హోటల్‌కు రప్పించినట్లు పోలీసులు తెలిపారు.
అక్కడ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని చెప్పి మత్తు పదార్థం కలిపిన పానీయం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అది తాగిన తర్వాత యువతి స్పృహ కోల్పోగా, ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, ఆమె అనుమతి లేకుండా వ్యక్తిగత దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన విషయాన్ని గుర్తించి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

