పిఠాపురంలో ‘అమృత్’ వెలుగులు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పాటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక రైల్వే ప్రాజెక్టుల గురించి సుదీర్ఘంగా చర్చించారు.
పిఠాపురం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పట్టణమని, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతికా దేవి ఆలయం, పాదగయ క్షేత్రం మరియు శ్రీపాద వల్లభ స్వామి వారి జన్మస్థలం ఇక్కడే ఉన్నాయని పవన్ కేంద్రమంత్రికి వివరించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల కోసం మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట – ఉప్పాడ ప్రధాన రహదారిపై లెవల్ క్రాసింగ్ కారణంగా ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ‘సేతు బంధన్’ పథకం కింద మంజూరైన రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ‘పీఎం గతిశక్తి’ పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. దీనివల్ల నిధుల లభ్యత పెరిగి నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని, 2030 జాతీయ రైల్ ప్రణాళికలో భాగంగా లెవల్ క్రాసింగులను తొలగించాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
పిఠాపురం – కాకినాడ మధ్య రైలు అనుసంధానాన్ని మరింత పెంచడం వల్ల ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు సమయం ఆదా అవుతుందని డిప్యూటీ సీఎం సూచించారు. వీటితో పాటు పిఠాపురం మీదుగా వెళ్లే నాలుగు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్థానిక స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు ,విశాఖ రైల్వే జోన్ పురోగతిపై కూడా ఈ సందర్భంగా చర్చించారు.
ఉపముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పిఠాపురం స్టేషన్ అభివృద్ధికి మరియు ఆర్‌ఓబీ పనుల వేగవంతానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పీఎం గతిశక్తి పథకం కింద ఈ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని తెలిపారు. తన విన్నపాలపై సానుకూలంగా స్పందించినందుకు పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

