Breaking NewsHome Page SliderInternationalNewsNews Alert

ఇరాన్‌పై అమెరికా దాడుల మోత

వాషింగ్టన్: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా తొమ్మిదో రోజు కూడా వైమానిక, క్షిపణి దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక సామర్థ్యానికి భారీ నష్టం వాటిల్లిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుల గౌరవార్థమే ఈ చర్యలు చేపట్టామని, అణ్వాయుధాల కోసం ప్రయత్నించే ఏ దేశమైనా ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధి ప్రస్తుతం అమెరికా బలగాల నియంత్రణలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేవరకు సైనిక చర్యలు కొనసాగుతాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా స్పందించింది. పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలైన కువైట్, జోర్డాన్‌ల వైపు డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. అయితే వాటిని తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆయా దేశాలు తెలిపాయి. అలాగే సిరియాలోని అమెరికా సైనిక స్థావరంపై ప్రతీకార దాడులు జరిపినట్లు, ఒక అమెరికా ఎంక్యూ -9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్, హర్మూజ్ జలసంధిపై తమకే పూర్తి నియంత్రణ ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో హర్మూజ్ సమీపంలో ఓ వాణిజ్య నౌకలో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతుండటంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా మళ్లీ పెరుగుతున్నాయి.