Breaking NewsHome Page SliderInternationalNewsNews Alert

ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ

హైదరాబాద్ (ఏడీఎన్ఎన్) – ఉద్యోగం పేరుతో ఒమన్‌కు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ తీవ్ర మోసానికి గురైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని పహాడీషరీఫ్‌కు చెందిన షబ్నమ్ బేగంకు నెలకు 200 ఒమానీ రియాల్స్ జీతంతో ఇంటిపని ఇప్పిస్తామని ఓ రిక్రూట్‌మెంట్ ఏజెంట్ హామీ ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఈ ఏడాది మార్చి 26న మస్కట్‌కు వెళ్లింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏజెంట్ చెప్పినట్లుగా ఒకే ఇంట్లో కాకుండా, పలువురు యజమానుల ఇళ్లలో బలవంతంగా పనిచేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ 12 నుంచి 15 గంటల పాటు విరామం లేకుండా పనిచేయించడంతో పాటు, సరైన ఆహారం, విశ్రాంతి, వసతి కూడా కల్పించలేదని వారు తెలిపారు. అంతేకాకుండా నాలుగు నెలలుగా ఒక్క రూపాయి జీతం కూడా చెల్లించకుండా శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులను తట్టుకోలేక షబ్నమ్ బేగం అక్కడి నుంచి తప్పించుకుని ప్రస్తుతం మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతోంది. తనను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటోంది. బాధితురాలి కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, భారత రాయబార కార్యాలయ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, ఆమెను వెంటనే హైదరాబాద్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తప్పుడు హామీలతో విదేశాలకు పంపిన రిక్రూట్‌మెంట్ ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.