చైనా-బ్రిటన్ సంబంధాలపై విమర్శలెందుకు..?
తాజాగా బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బీజింగ్ లో అడుగుపెట్టారు. 2018 తర్వాత చైనాను సందర్శించిన తొలి బ్రిటన్ ప్రధానమంత్రి ఈయనే కావడం గమనార్హం. ఈ సందర్శనలో భాగంగా గురువారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా బ్రిటన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రయత్నాల్లో ఇది అత్యంత ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.
ఈ పర్యటనలో కీర్ స్టార్మర్‌తో పాటు హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, జీఎస్‌కే ఫార్మాస్యూటికల్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు, నేషనల్ థియేటర్‌కు చెందిన సాంస్కృతిక రంగ ప్రముఖులు కలిపి సుమారు 60 మంది పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక సహకారం ప్రధాన అజెండాగా ఈ పర్యటన కొనసాగనుంది.
అయితే, చైనాతో సన్నిహిత సంబంధాలపై బ్రిటన్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెల్తుతున్నాయి. ప్రపంచ దృక్కోణం మారిపోయిందని, చైనా కమ్యూనిస్టు పార్టీని నమ్మలేమని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. చైనాతో వ్యవహారాల్లో యూకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. షీ జిన్‌పింగ్‌తో భేటీలో మానవ హక్కుల ఉల్లంఘనల అంశాన్ని ప్రధాని ప్రస్తావిస్తారా అన్న ప్రశ్నలకు, ‘సవాళ్లతో కూడిన అంశాలను ఆయన తప్పకుండా లేవనెత్తుతారు’ అని ప్రధాని కార్యాలయం తెలియజేసింది.
చైనాలోని షిన్‌జియాంగ్ ప్రాంతంలో వీగర్‌లు సహా ముస్లిం మైనారిటీ తెగలపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారమే రేపాయి. హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల మీడియా దిగ్గజం జిమ్మీ లాయ్‌పై చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా పలు విమర్శలు తలెత్తాయి. ఇప్పుడు ఆయన జైలులో జీవిత ఖైదును ఎదుర్కొంటున్నారు.
మానవ హక్కుల అంశాలతో పాటు, బ్రిటన్‌లో చైనా చేస్తున్న గూఢచర్య కార్యకలాపాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వ ఏజెంట్లు బ్రిటన్ జాతీయ భద్రతకు నిరంతర ముప్పుగా మారుతున్నారని బ్రిటిష్ నిఘా సంస్థ ఎం15 చీఫ్ ఇటీవల స్పందించారు.
చైనా పర్యటనకు ముందు కీర్ స్టార్మర్ మాట్లాడుతూ, “చైనా విషయంలో గత కొన్నేళ్లుగా మన విధానం నిలకడగా లేదు. మనకు నచ్చినా నచ్చకపోయినా, బ్రిటన్‌కు చైనా చాలా ముఖ్యమైన దేశం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటైన చైనాతో వ్యూహాత్మకంగా, స్థిరంగా సంబంధాలు కొనసాగించడం మన జాతీయ ప్రయోజనాలకు అవసరం” అని అన్నారు. సవాళ్లను విస్మరించబోమని, విభేదాలున్నా చర్చల ద్వారానే ముందుకు వెళ్లాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ప్రధాని స్టార్మర్‌తో పాటు బిజినెస్ సెక్రటరీ పీటర్ కైల్, ట్రెజరీ ఎకనామిక్ సెక్రటరీ లూసీ రిగ్బీ పాల్గొంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో పీటర్ కైల్, ఏడాది క్రితం చాన్సలర్ రాచెల్ రీవ్స్, అంతకుముందు ప్రస్తుత ఉపప్రధానమంత్రి డేవిడ్ లామీ చైనాలో పర్యటించారు.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ కూడా ఇటీవల చైనాను సందర్శించారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం గుర్తుచేస్తోంది. చైనా పర్యటన తర్వాత కీర్ స్టార్మర్ జపాన్‌కు వెళ్లి అక్కడ నూతన ప్రధాని సనాయె టకయిచితో భేటీ కానున్నారు.

