ప్రపంచంలోనే భయంకర ‘మృత్యుదీవి’
ప్రపంచంలో అందమైన , ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలు కొకొల్లలు. ఇవన్ని కూడా మనసును ఆహ్లాదం కలిగించేవి కాకుండా , కలవరపెట్టే భయానక ప్రదేశాలూ చాలా ఉన్నాయి. భయంకర ప్రాంతాల్లో ఒకటైన ఇటలీలోని వెనిస్ నగరానికి సమీపంలో ఉన్న పోవెగ్లియా దీవి ఉంది. ఇందులో కాలువలు, పడవ ప్రయాణాలు, అందమైన నిర్మాణాలతో వెనిస్ ఎంత పేరు పొందిందో , దానికి కొద్ది దూరంలోనే ఉన్నమరో దీవి అంతటి చీకటి చరిత్రతో ప్రసిద్ధి చెందింది. అందుకే స్థానికులు దీన్ని ‘మృత్యుదీవి’, ‘దెయ్యాల దీవి’గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ దీవిలోకి సామాన్య ప్రజలు వెళ్లకుండా ఇటలీ ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది.
పోవెగ్లియా దీవి చరిత్ర క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిందిగా పురాతన శాస్త్రవేత్తలు నివేదించారు. అప్పట్లో శత్రు దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఈ దీవిని ఆశ్రయించారు. చాలా కాలం పాటు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం, 18వ శతాబ్దంలో ఒక్కసారిగా భయానక రూపం దాల్చింది. యూరప్‌ను అతలాకుతలం చేసిన బ్యుబోనిక్ ప్లేగు వ్యాధి సోకిన వారిని ఈ దీవికి తరలించి ఒంటరిగా ఉంచేవారు. కుటుంబాలకు దూరంగా, సరైన వైద్యం లేకుండా వేలాది మంది ఇక్కడే మృత్యువాత పడ్డారు. చరిత్రకారుల అంచనాల ప్రకారం లక్షకు పైగా మంది ఈ దీవిలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్లేగు తగ్గిన తర్వాత కూడా దీవికి శాంతి దక్కలేదు. 1922లో ఇక్కడ మానసిక రోగుల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ వైద్య చికిత్సలకంటే అమానుష ప్రయోగాలే ఎక్కువగా జరిగాయని ప్రచారం భారీగా జరిగింది. రోగులపై మత్తుమందు లేకుండా ప్రమాదకర ప్రయోగాలు చేశారనే కథలు నేటికీ వినిపిస్తాయి. ఆ ఆసుపత్రి మూతపడినా, శిథిల భవనాలు ఇప్పటికీ భయాన్ని కలిగిస్తున్నాయి.
నేడు పోవెగ్లియా పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఇక్కడ మృతదేహాలను పెద్ద సంఖ్యలో పూడ్చిపెట్టడం, కాల్చడం వల్ల దీవి మట్టిలో మానవ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతారు. రాత్రి వేళ వింత శబ్దాలు, నీడల ఆకృతులు కనిపిస్తాయని స్థానికులు నమ్ముతారు. అందుకే ఆ ప్రాంతం వైపు వెళ్లేందుకు మత్స్యకారులు కూడా వెనకడుగు వేస్తారు.

