Home Page SliderInternational

ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5- ఈ ఏడాది థీమ్ ఏంటంటే..

Share with

‘ప్రకృతిని మనం పరిరక్షిస్తేనే అది మనల్ని రక్షిస్తుంది’. లేదంటే ప్రళయంలా విరుచుకుపడుతుంది. మానవ తప్పిదాలతో జరిగే ప్రకృతి విపత్తులు ఎన్నో ఉన్నాయి. పర్యావరణ వేత్తల సలహా ప్రకారం ప్రకృతి సమతుల్యతను కాపాడే ఉద్దేశంతో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్‌ను అరికట్టడం. ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అనే స్లోగన్‌తో పర్యావరణ ప్రేమికులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే మహా యజ్ఞాన్ని మొదలు పెట్టారు. ప్రతీ సంవత్సరం దాదాపు 4 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. దానిలో కేవలం 10 శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతోంది. అంటే 90 శాతం నదుల్లో, సముద్రాల్లో, సరస్సుల్లో చేరుతోంది. భూమిలో కలిసి పోలేక నీటిని కాలుష్యం చేస్తూ భూమికే ముప్పు తీసుకొస్తున్నాయి ఈ ప్లాస్టిక్ పదార్థాలు.

అంతే కాదు మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు మనం తినే ఆహారంలో, త్రాగే నీటిలో కలిసి పోయి శరీరంలో విషాన్ని నింపుతున్నాయి. దీనికారణంగా మానవులలో, జంతువులలో రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రతీ సంవత్సరం జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం మనం 50 వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో 150 దేశాలకు పైగా పాల్గొంటాయి. యునైటెడ్ నేషన్స్ అధ్వర్యంలో అన్ని దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు, వాలంటీర్ సంస్థలు నివాస యోగ్యమైన భూమండలం కోసం , పర్యావరణ హితం కోసం కలిసి పని చేస్తున్నాయి.