వినేశ్ ఫొగాట్‌కు బిగ్ రిలీఫ్!
. WFIకి ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు
భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ పాల్గొనడానికి అనర్హురాలని డబ్ల్యూఎఫ్‌ఐ చెప్పడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వినేశ్‌ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కావాలని నిబంధనలు మార్చారా? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం డబ్ల్యూఎఫ్‌ఐని నిలదీసింది. “భారత్‌లో మాతృత్వాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు. అలాంటిది ఒక బిడ్డకు జన్మనిచ్చిన కారణంతో ఆమెను పక్కనపెట్టడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం ఏమాత్రం సరికాదు. ఇది క్రీడల భవిష్యత్తుకే ప్రమాదకరం” అని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా వినేశ్ ఫొగాట్ ఫైనల్‌లో అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఘటనను ‘దేశానికి అవమానం’ అని పేర్కొంటూ మే 9న డబ్ల్యూఎఫ్‌ఐ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఆమె ఒలింపిక్ ఫైనల్‌కు చేరడాన్ని దేశం మొత్తం ఎంత గర్వంగా చూసిందో మీకు తెలియదా? అలాంటి అద్భుతమైన ప్రదర్శనను దేశానికి అవమానం అని ఎలా అంటారు?” అని అధికారులపై మండిపడింది. కాగా, ఈ సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ గనుక విజయం సాధిస్తే.. ఆసియా గేమ్స్‌లో పాల్గొనడానికి ఆమె అర్హత ప్రమాణాల్లో సడలింపు ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. మొత్తానికి వినేశ్ ఫొగాట్‌కు కోర్టు అండగా నిలవడంతో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

