crimehome page sliderHome Page SliderInternational

హమాస్ అగ్రనేత హతం

ఇజ్రాయెల్ దాడుల్లో మరో 31 మంది మృతి

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్తంగా ఇచ్చిన అత్యంత రహస్య ఆదేశాలతో ఐడీఎఫ్ గాజాలో చేపట్టిన భారీ వేట విజయవంతమైంది. 2023 అక్టోబర్ 7 నాటి మారణకాండకు అత్యంత కీలక సూత్రధారి, హమాస్ గూఢచార విభాగం మాజీ అధిపతి అయిన ‘ముహమ్మద్ ఒడే’ను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. ఇటీవలే ఐడీఎఫ్ దాడిలో హతమైన ఎజ్జెడిన్ అల్-హద్దాద్ స్థానంలో.. కేవలం వారం క్రితమే ముహమ్మద్ ఒడే హమాస్ సైనిక విభాగానికి కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. బాధ్యతలు చేపట్టిన వారానికే ఇజ్రాయెల్ అంతం చేయడం హమాస్‌కు కోలుకోలేని దెబ్బగా మారింది. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో నలుగురు చిన్నారులు సహా 31 మంది ప్రాణాలు కోల్పోగా, పశ్చిమాసియా అంతటా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 27న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. “అక్టోబర్ 7 మారణకాండకు కారణమైన ప్రతి ఒక్కరినీ వేటాడి చంపుతాం. హమాస్ కొత్త సైనిక చీఫ్ ముహమ్మద్ ఒడే అంతం కేవలం ఒక ఆరంభం మాత్రమే” అని నెతన్యాహు ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు.
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలను రెండు పక్షాలూ తుంగలో తొక్కడంతో రణరంగం మరింత భీకరంగా మారింది. ఒకవైపు గాజాలో హమాస్ అగ్రనాయకత్వాన్ని సమూలంగా తుడిచిపెడుతూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చారిత్రాత్మక విజయం సాధించింది.

హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై తన దాడులను మునుపెన్నడూ లేనంతగా తీవ్రం చేసింది. మంగళవారం నుంచి ఇజ్రాయెల్ తన గ్రౌండ్ ఆపరేషన్లను విస్తృతం చేయడంతో పాటు వైమానిక దాడులతో లెబనాన్‌ను వణికించింది. టైర్ జిల్లాలోని బుర్జ్ రహల్, కవథరియాత్ అల్-రుజ్, శ్రీఫా పట్టణాలతో పాటు మర్జయౌన్ జిల్లాలోని అస్-సవానా, ఖబ్రిఖా ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. ‘అల్ జజీరా’ నివేదికల ప్రకారం, ఈ దాడుల్లో కనీసం 31 మంది మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేవలం బుర్జ్ అల్-షమాలి ప్రాంతంలోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

లెబనాన్ సరిహద్దుల్లో డ్రోన్ దాడులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. హిజ్బుల్లాను పూర్తిగా అణచివేయడానికి ఇజ్రాయెల్ చేపట్టే పెద్ద ఆపరేషన్లకు అమెరికా కూడా అంతర్గతంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దౌత్య వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నెతన్యాహు తన సైన్యానికి మరింత కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వారంలోనే తమ సైన్యం 600 మందికి పైగా హిజ్బుల్లా ఉగ్రవాదులను హతమార్చిందని, శత్రువును పూర్తిగా తుడిచిపెట్టే దాకా ఈ పోరు సాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని వీడియో ప్రకటన ద్వారా స్పష్టం చేయడంతో పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని యుద్ధ భయాందోళనలు నెలకున్నాయి.