InternationalNews

చైనాతో పాక్ 15 ఒప్పందాలకు పచ్చజెండా

పాకిస్తాన్ తో తమకు దశాబ్దాలుగా ఉన్న విడదీయరాని సాంప్రదాయ స్నేహ బంధాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రశంసించారు. చైనా పర్యటనలో భాగంగా పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌లతో కలిసి బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’ భవనంలో జిన్‌పింగ్‌తో సోమవారం అధికారికంగా భేటీ అయ్యారు. పాక్ ప్రధానికి ఘనస్వాగతం పలికిన జిన్‌పింగ్‌.. షెహబాజ్‌ను తన ‘పాత మిత్రుడు’ అని సంబోధించారు. చైనా అత్యంత ప్రాధాన్యంనిచ్చే ప్రత్యేక దేశాల సమూహంలో పాకిస్తాన్ ఒకటని గుర్తు చేస్తూ.. అన్ని కాలాలకు అనువైన వ్యూహాత్మక భాగస్వామిగా పాక్‌తో తమకు సన్నిహిత ఆర్థిక, వాణిజ్య, భద్రతా సహకారాలు ఉన్నాయని ఆయన కొనియాడారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా-ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ముసాయిదా రూపకల్పనలో కీలక మధ్యవర్తిత్వం వహించినందుకు ఇస్లామాబాద్‌ను జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కీలక సమావేశంలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ పరిస్థితులు ,రాజకీయ సమీకరణాలు ఎలా మారినప్పటికీ, చైనా ఎల్లప్పుడూ తన పొరుగు దేశాల దౌత్యంలో పాక్‌-చైనా సంబంధాల అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ యొక్క స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో చైనా పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అండగా నిలిచారు. ఉమ్మడి భవిష్యత్తుతో మరింత ఐక్యత గల చైనా-పాకిస్తాన్ సమాజాన్ని నిర్మించడానికి బీజింగ్ సిద్ధంగా ఉందని, రెండు దేశాలు భద్రతా సహకారాన్ని మెరుగుపరుచుకుంటూ ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని సంయుక్తంగా కాపాడాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. పాక్‌-చైనాలు సాటిలేని అత్యున్నత బంధం కలిగిన రెండు ‘ఉక్కు సోదర దేశాలు’ (ఐరన్ బ్రదర్స్) అని అభివర్ణించారు. పశ్చిమాసియా శాంతి చర్చల ప్రక్రియలో పాకిస్తాన్ కు చైనా అందించిన దౌత్యపరమైన మద్దతుకుగానూ ఆయన అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలు దశాబ్దాలుగా ఒకదానికొకటి అర్థం చేసుకుని, పరస్పర విశ్వాసంతో మద్దతు ఇచ్చుకుంటూ ఈ స్థాయికి చేరాయని పేర్కొన్నారు. వ్యూహాత్మక చర్చల తర్వాత రెండు దేశాల ప్రతినిధుల సమక్షంలో చైనా-పాకిస్తాన్ మధ్య ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాలతో కూడిన మొత్తం 15 ప్రతిష్టాత్మక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. తాజా భేటీతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, సైనిక బంధం బలోపేతం కానుంది.