కబ్జాదారులపై హైడ్రా ఉక్కుపాదం
రూ.4,117 కోట్ల విలువైన భూములు స్వాధీనం
హైదరాబాద్ మహనగరంలోని ఐటీ కారిడార్, కోకాపేట పరిసరాల్లో చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాపై ‘హైడ్రా’ ఉక్కుపాదం మోపింది. మార్కెట్‌లో ఎకరం రూ.150 కోట్లకు పైగా పలికే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బడా రియల్టర్లు సాగిస్తున్న భూదందాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. నగరం నలువైపులా ఏకకాలంలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో సుమారు రూ.4,117 కోట్ల విలువైన ప్రభుత్వ, చెరువు శిఖం భూములను స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఆ భూముల చుట్టూ రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు.
ఈ మెగా ఆపరేషన్‌లో భాగంగా కోకాపేటలోని ‘కొత్తచెరువు’ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాగించిన అక్రమాలు బట్టబయలయ్యాయి. ‘గోల్డ్‌ఫిష్ కాలనీ’ పేరుతో విల్లాలను నిర్మించడమే కాకుండా, చెరువును మట్టితో పూడ్చివేసి నిర్మించిన లగ్జరీ గార్డెన్లు, క్రీడా ప్రాంగణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్దచెరువు పరిధిలో బహుళ అంతస్తుల భవనాల కోసం ఆక్రమించిన సుమారు 22 ఎకరాల స్థలాన్ని కూడా కాపాడారు. ఒక్క కోకాపేటలోనే స్వాధీనం చేసుకున్న భూముల మార్కెట్ విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని ‘ఈదులకుంట’ చెరువును ఏకంగా మ్యాప్ నుంచే తొలగించేందుకు జరిగిన భారీ కుట్రను హైడ్రా భగ్నం చేసింది. వరద కాలువను దారి మళ్లించి, చెరువు ఎండిపోయేలా చేసి ఆకాశహర్మ్యాలు నిర్మించాలనుకున్న కబ్జాదారుల వ్యూహాన్ని శాటిలైట్ చిత్రాల ఆధారంగా తిప్పికొట్టారు. అక్కడ రూ.600 కోట్ల విలువైన 6.50 ఎకరాల చెరువు స్థలంతో పాటు, దానికి ఆనుకుని ఉన్న రూ.500 కోట్ల విలువైన 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అటు భరత్‌నగర్-హఫీజ్‌పేట్ మార్గంలో రోడ్డు విస్తరణ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కార్యాలయం, గోశాలను కూల్చివేసి రూ.17 కోట్ల విలువైన స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. ఈ చారిత్రాత్మక చర్యతో భూకబ్జాదారులకు ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపినట్లయింది.

