Home Page Sliderhome page sliderNewsNews AlertTelangana

మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ


తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు ఒక కీలక లేఖ రాశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగమైన ‘తుమ్మిడిహట్టి బ్యారేజీ’ నిర్మాణ మోడాలిటీస్, దాని ఎత్తును ఖరారు చేయడంపై చర్చించేందుకు వీలుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అందులో కోరారు. ఈ అంశంపై చర్చలు జరిపేందుకు తన నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి తగిన సమయం (డేట్) కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

గతంలో (2016 ఆగస్టు 23న) జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో తుమ్మిడిహట్టి బ్యారేజీని 148 మీటర్ల పూర్తి జలాశయ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని సీఎం గుర్తుచేశారు. అయితే, ఇటీవల తాము సాగునీటి నిపుణులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వరుస సమీక్షల ప్రకారం.. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల భవిష్యత్తు నీటి అవసరాలు పూర్తిగా తీరవనే ముగింపునకు వచ్చినట్లు వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలంటే ఈ బ్యారేజీ ఎత్తుపై మరోసారి సరికొత్తగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్ (నీటి మట్టం) పెరిగితే గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారా తెలంగాణకు సహజసిద్ధంగా నీళ్లు వస్తాయని, తద్వారా భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ఖర్చులు తప్పుతాయని రేవంత్ రెడ్డి వివరించారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 148 మీటర్ల కంటే కొద్దిగా పెంచినప్పటికీ.. మహారాష్ట్ర వైపు ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని లేఖలో భరోసా ఇచ్చారు. ఈ అంతర్రాష్ట్ర జల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుని ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.