గొడ్డలి పార్టీ నెవర్ అగైన్
మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఐటీ మనదైతే.. గొడ్డలి వారిదంటూ కౌంటర్
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పసుపు పండుగ ‘మహానాడు’ హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, నందమూరి తారకరామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్‌తో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొని ఎన్టీఆర్‌కు అంజలి ఘటించారు. తర్వాత ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
మహానాడు అనేది ప్రజలందరికీ భరోసానిచ్చే ఒక పవిత్రమైన ఉత్సవమని చంద్రబాబు అభివర్ణించారు. సమావేశాలు పెట్టి మహానాడును డైవర్ట్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఏపీని సర్వనాశనం చేసిన ‘గొడ్డలి పార్టీ’ని రాష్ట్రం నుంచి శాశ్వతంగా దూరం పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పేదలకు కావాల్సింది సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి శాంతిభద్రతలే తప్ప.. గొడ్డలి పోట్లు, జంతు బలులు కావని హితవు పలికారు. రక్త చరిత్ర రాసేవారు ఎప్పటికీ స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరంటూ ‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు ఎప్పటికీ ఒక్కటి కాబోవని చంద్రబాబు తేల్చిచెప్పారు. “వేటకొడవళ్ల నుంచి గొడ్డలి దాకా ఎదగడం వారి విధానమైతే.. ఐటీ నుంచి క్వాంటం టెక్నాలజీ దిశగా దూసుకెళ్లడం మన విధానం.. బోత్ ఆర్ నాట్ సేమ్” అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు. పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులకు సముచిత స్థానం కల్పించని నాయకులను ఉపేక్షించేది లేదని, అందరికీ పార్టీయే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికతను ఏపీకి తీసుకొస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 280 ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.

