జనసేన నాయకులా? కామాంధులా?
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని వేధించిన ఈ ‘కీచక’ ఎమ్మెల్యేను వెంటనే పదవి నుంచి తొలగించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నగరిలోని ఏ.జె.ఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఆర్కే రోజాతో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి , పెద్ద సంఖ్యలో పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లకార్డులు చేబూని ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
“జనసేన అంటే కామ సేన, కామాంధుల సేనగా మారిపోయింది. క్యారెక్టర్ లేని వ్యక్తులతో రాజకీయం చేస్తూ మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి. మహిళకు అన్యాయం జరిగితే స్పందించని వీరు నాయకులుగా ఉండటానికి అనర్హులు,” అని మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని రోజా ఆరోపించారు. ఒక మహిళా ఉద్యోగి తనకు జరిగిన అన్యాయాన్ని వీడియోల రూపంలో బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తక్షణమే రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, వైఫల్యం చెందిన రాష్ట్ర హోంమంత్రిని పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆర్కే రోజా స్పష్టం చేశారు.

