Andhra PradeshHome Page Slider

ఏపీలో పొత్తు తిప్పులు… ముస్లిం రిజర్వేషన్లపై టీడీపీ మల్లగుల్లాలు

Share with

ఏపీలో పొత్తు రోజు నుంచి రాజకీయాలు రంజుగా మారుతున్నాయ్. ఓవైపు వైసీపీని ఓడించి తీరాలని ధృడనిశ్చయంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో జతకట్టారు. అయితే పొత్తు వల్ల లాభాలున్నట్టుగానే, నష్టాలు తప్పేలా లేవనిపిస్తోంది. ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ భావిస్తుంటే, ఆ పార్టీని దెబ్బకొట్టేలా కూటమి తరపున టీడీపీ పథక రచన చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. ముస్లింల రిజర్వేషన్ అంశంతోపాటుగా, రాష్ట్రంలో పొత్తు లెక్కలు, పార్టీల వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లపై టీడీపీ-బీజేపీ మధ్య కీలక చర్చ జరిగింది. దేశ వ్యాప్తంగా తాము ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మాత్రమే రిజర్వేషన్లను తాము ఆమోదిస్తామని, కొత్త వర్గాలను వేటిని అందులో చేర్చబోమని పియూష్ గోయల్ స్పష్టం చేశారు. మొత్తంగా ముస్లింలకు రిజర్వేషన్లు తాము వ్యతిరేకిస్తున్నామని బీజేపీ స్పష్టం చేసినట్టయ్యింది.

ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, టీడీపీ ఇప్పుడు సరికొత్త సమస్యలను ఎదుర్కొంటోంది. వాస్తవానికి 2019లో వైసీపీకి పూర్తి స్థాయిలో మద్దతిచ్చిన మైనార్టీలు, ఆ తర్వాత టీడీపీ వైపు చూస్తున్నారన్న భావన ఉంది. మైనార్టీ ఓట్లు లాభిస్తాయని టీడీపీ భావించింది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ ఓట్లు ఏమవుతాయోనన్న వర్రీలో ఆ పార్టీ ఉంది. అయితే తాజాగా బీజేపీ నేతలు తాము ముస్లిం రిజర్వేషన్లను (మతప్రాతిపదికన) ఇవ్వబోమని, అందుకు అంగీకరించేది లేదని చెబుతున్నారు. దీంతో ముస్లిం రిజర్వేషన్లపై బిజెపి వైఖరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమికి ముస్లిం ఓటర్లను దూరం చేస్తుందని భావన నెలకొంది.