Home Page SliderNational

మీకో దండం.. మీ టికెట్‌కో దండం… సీనియర్ జర్నలిస్ట్ షాకింగ్ నిర్ణయం

Share with

మొన్న సూరత్, నిన్న ఇండోర్, నేడు పూరి.. కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కీలక స్థానాల్లో గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకమవ్వాలని భావిస్తున్న హస్తం పార్టీకి నేతలకు ఝలక్ మీద ఝలక్ ఇస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగినన్ని నిధుల లేవని ఆ పార్టీ ఒడిశా, పూరీ ఎంపీ అభ్యర్థి సుచరిత మొహంతి పోటీ నుంచి తప్పుకున్నారు. “పూరీలో గెలుపు ప్రచారానికి నిధుల కొరత మాత్రమే వెంటాడుతోంది. పార్టీ ఫండింగ్ లేకుండా పూరీలో ప్రచారం నిర్వహించడం సాధ్యం కాదు. అందువల్ల పూరీ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఇచ్చేస్తున్నాను’’ అంటూ సుచరిత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.

ఒడిశా కాంగ్రెస్ ఇన్‌చార్జి అజోయ్ కుమార్ తన సొంత నిధులను ఉపయోగించి పోరాడాలని కోరారని ఆమె ఆరోపించారు. ” 10 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన జీతంతో కొన్నాళ్లు మెయింటేన్ చేశానని పూరీలో ప్రచారం కోసం ఉన్నదంతా ఊడ్చేశానన్నారు. పార్టీ మద్దతు లేకుంటే పూరీలో ఎన్నికల ప్రచారం చేయడం కష్టం. ప్రచారం కోసం ప్రజా విరాళాల డ్రైవ్‌కు ప్రయత్నించా. కానీ అది వర్కౌట్ కాలేదు.” అని ఆమె పేర్కొన్నారు. పూరీ లోక్‌సభ స్థానానికి ఆమె నామినేషన్ తర్వాత, క్రౌడ్-ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చడానికి ప్రయత్నించానన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో UPI QR కోడ్, ఇతర ఖాతా వివరాలను షేర్ చేశారు.

పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ, తాను కాంగ్రెస్‌కు నమ్మకమైన కార్యకర్తగా కొనసాగుతున్నానని, అయితే తనంతట తానుగా నిధులు సమకూర్చుకోలేకపోవడం, పార్టీ తనకు ఇవ్వకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. పూరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌తో ఎమ్మెల్యే మొహంతి అసంతృప్తితో ఉన్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని పార్టీ సీనియర్లను అభ్యర్థించారు. అయినా పార్టీ ఆమెను పట్టించుకోలేదు. మే 25న పూరీలో ఓటింగ్ జరగనుంది.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సూరత్, ఇండోర్‌లలో అభ్యర్థులను కోల్పోయింది. ఏప్రిల్ 22న, సూరత్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ అనర్హత వేటు పడటంతో, బీజేపీకి చెందిన ముఖేష్ దలాల్ ఏకపక్షంగా గెలిచినట్లు ప్రకటించారు. ఇండోర్ నుంచి కాంగ్రెస్ బరిలోకి దిగిన అక్షయ్ బామ్, ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తాజాగా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన సుచరిత మొహంతి తాను పోటీ నుంచి వైదులుగుతున్నట్టు ప్రకటించారు.