Andhra Pradesh

టికెట్‌ కేటాయింపుపై చంద్రబాబు ఫిటింగ్

Share with

◆ టీడీపీఎల్పీ సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన
◆ వచ్చే ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకం
◆ దూకుడు పెంచిన చంద్రబాబు.. వేగంగా నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అనంతరం దూకుడు పెంచిన చంద్రబాబు పలుకీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరుస్తూ నాయకులకు దిశా నిర్దేశం చేస్తూ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చిన జగన్‌ను సమర్థవంతంగా ఢీ కొట్టి ఎలా అయినా అధికారాన్ని చేపట్టాలని ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నుండి ఏపీలో ప్రారంభమైన వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కునేందుకు ఆ పార్టీ సభ్యులకు పలు సూచనలు చేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు తన పార్టీ శాసనసభ్యులకు పలు సూచనలు ఇచ్చిన అనంతరం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి మళ్లీ టికెట్లు కేటాయిస్తానని ప్రకటించారు.

చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై ఆ పార్టీ సభ్యులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో నిద్రవాస్థలో ఉన్న పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబునాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నేతలను పిలిపించి హెచ్చరిస్తూ వారికి దిశా నిర్దేశం చేస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమము ద్వారా ఇప్పటికే ఆయన తనయుడు నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్తున్నారు. కొన్ని జిల్లాల్లో డీలాగా ఉన్న క్యాడర్ ను అప్రమత్తం చేస్తూ నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలను సరిచేస్తూ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ల కేటాయింపు ఉంటుందని ప్రకటించిన చంద్రబాబు మిగిలిన నియోజకవర్గాల్లో వివిధ సంస్థల ద్వారా చేపించిన సర్వేలు ఆధారంగా కష్టపడి పని చేసే వారికి ఈసారి ఎన్నికల్లో టికెట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వడపోతలు ప్రారంభించిన చంద్రబాబు ఆర్థికంగా, సామాజికంగా, అంగ బలం ఉండి పార్టీ కోసం కష్టపడే వారిని ఆయా నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందే ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఈసారి ఎన్నికలకు చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కుల సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుండి వివిధ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషం వరకు అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో తెలియదు కాబట్టి ఎవరికి వారు ఇప్పటికే గ్రూపు రాజకీయాలకు తెర తీసి తమ ప్రత్యర్థులను అధిష్టానం వద్ద బలహీనపరుస్తున్నారు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల నుండి ఎన్నారైలు కూడా టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ పొందితే వారి కోసం పార్టీ క్యాడర్ ఎంతవరకు పని చేస్తుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని కొత్త వారికి అవకాశం ఇచ్చిన పదవీకాలం పూర్తయ్యే వరకు ఉండి తర్వాత ఆ నియోజకవర్గ వైపే కన్నెత్తి చూడకపోవటం వల్ల ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరి అధ్వానంనంగా తయారవుతోందని భావించిన నేపథ్యంలో ఈసారి ఎన్నారైలకు టికెట్లు కేటాయించరని తెలుస్తుంది.

ఏపీలో కొంతమేర వైసీపీపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి అంశాన్ని చంద్రబాబు కీలకంగా తీసుకుంటున్నారు. కార్యకర్తల కోరిక మేరకు సమర్థవంతమైన నాయకులకు మాత్రమే ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలవాలనే తలంపుతో ఉన్న చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తాయా ? అన్నది చూడాలి.