Andhra PradeshHome Page Slider

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ ప్రచారం నమ్మితే అంతే అంటున్న బీజేపీ

Share with

ఏపీలో జరుగుతున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దూమారంపై బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాథ బాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఎవరైనా అమలు చేయాల్సిందేన్నారు. సాక్షాత్తూ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినా దీన్ని అమలు చేయాల్సిందేనన్నారు. కానీ చంద్రబాబు ఏకపక్షంగా, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పారని ఇది సమంజసం కాదన్నారు. అసలు చట్టం రద్దు చేస్తామని చెప్పే ముందు చట్టం పూర్వపరాలు ఏంటన్నది పరిశీలించలేదన్నారు. దేశంలోని భూహక్కులను డిజిటలైజేషన్ చేయాలన్న సూచన ఇచ్చింది నీతి అయోగ్ అని ఆయన చెప్పారు. నీతి అయోగ్ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ముసాయిదా పంపించిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు డ్రోన్లతో సర్వేలు చేశాయన్నారు. భూముల హక్కులపై లిటిగేషన్లు లేకుండా సర్వ హక్కులు కల్పించేందుకు చట్టం చేయాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం కోరిందన్నారు రఘునాథబాబు.

ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేశాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వరకు చేసిందన్నారు. ఇందుకోసం కేంద్రం 200 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిందన్నారు. బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పుడు.. కేంద్రం తీసుకొచ్చిన పథకాలపై విమర్శించడం దారుణన్నారు. కేంద్రం వద్ద డబ్బు తీసుకొని, వారి సూచనలతో కార్యక్రమం చేపట్టినప్పుడు, చంద్రబాబు ఇలా ప్రకటించడం విడ్డూరమన్నారు. ఆస్తులు పోతాయని, లాగేసుకుంటారని అపోహలు సృష్టించడం ఏ పద్ధతని ప్రశ్నించారు. కేంద్రమైనా, రాష్ట్రమైనా రాజ్యాంగానికి కట్టుబడే పనిచేస్తాయన్న ఆయన.. దేశంలో ఎవరైనా మరెవరివో స్థలాలను అక్రమంగా కొట్టేస్తే కోర్టులు, ప్రభుత్వ యంత్రాంగాలు చూస్తూ ఊరుకుంటాయా అని ప్రశ్నించారు. కేవలం అపోహ సృష్టించి… రాజకీయంగా లబ్ధిపొందాలని చూడటం దారుమణమన్నారు. ఇలాంటి ప్రచారం చేయడం వల్ల… చావుబతుకుల మధ్య, చికిత్సలు చేసుకుంటున్నవారికి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు రఘునాథబాబు.