Andhra PradeshHome Page Slider

50 రూపాయలకే కిలో టమాటా

Share with

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. మార్కెట్లో టమాటా ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో కిలో రూ.50 టమాటాను విక్రయించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కడప, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభించారు. ఇతర జిల్లాల్లోను నేటి నుంచి ప్రారంభించబోతున్నట్లు అధికారులు తెలియజేశారు. కర్నూల్ నగరంలోని సి క్యాంప్ రైతు బజార్‌లో సబ్సిడీ ధర పై టమాటా విక్రయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారికంగా ప్రారంభించింది, ఇది రాష్ట్రంలోనే అతిపెద్దది. రైతుబజార్ ఎస్టేట్ అధికారి టి హరీష్ కుమార్ మాట్లాడుతూ.. మదనపల్లె మార్కెట్ నుంచి 7 టన్నుల టమోటాలు వచ్చాయని, అవి కర్నూలు నగరంలోని మూడు రైతు బజార్లకు కేటాయించినట్లు తెలిపారు.


రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ క్రమంగా టమాటా విక్రయాలు ప్రారంభం కానున్నాయి” అని రైతు బజార్ల సీఈఓ నంద కిషోర్ తెలిపారు. “మార్కెట్‌లో ప్రస్తుతం టమోటాల కొరత అతి కొద్ది కాలంలోనే తీరిపోతుందని మేము ఆశిస్తున్నట్లు ఇదే విషయాన్ని కేంద్రం తెలియజేసినట్లు వివరించారు. డిమాండ్‌, సప్లయ్‌ల మధ్య పొంతన లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని ఆయన వివరించారు. కూరగాయలు ఎక్కువగా పండే ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడం పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో కూరగాయల సరఫరా తగ్గడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో టమాటా పెద్ద ఎత్తున లభిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా మదనపల్లి మార్కెట్‌పైనే ఆధారపడి సరఫరా చేస్తున్నారు. మదనపల్లెలో బుధవారం ఉదయం కిలో రూ.70 ఉన్న టమాటా సాయంత్రం రూ.135కు చేరగా.. మరుసటి రోజు కిలో రూ.85కి చేరింది. రైతు బజార్లు పంపిన ఇండెంట్ల ఆధారంగా ప్రభుత్వం టమోటాలను కొనుగోలు చేస్తోంది.