Home Page SliderNational

ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ప్రసంగాలపై రెండు పార్టీలకు ఈసీ నోటీసులు

Share with

ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ ఎంపీ రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రసంగాల్లో మోడల్‌ కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇద్దరు అగ్రనేతలు, ర్యాలీల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లకు ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై విమర్శలు ఎదుర్కొంటున్న ఈసీ, ఇప్పుడు రెండు పార్టీల అధ్యక్షులు బిజెపికి చెందిన జెపి నడ్డా, కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున్ ఖర్గే నుండి మోదీ, రాహుల్ చేసిన కామెంట్స్‌కు బదులివ్వాల్సిందిగా కోరింది. ఏప్రిల్ 29, సోమవారం ఉదయం 11 గంటలలోపు ఇవ్వాలని పేర్కొంది. ఈ ఉదయం విడుదల చేసిన రెండు పేజీల ప్రకటనలో, స్టార్ క్యాంపెయినర్లు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఉపన్యాసాలపై ఫిర్యాదులపై రియాక్ట్ అయ్యింది. సాధారణంగా తమ అభ్యర్థుల ప్రవర్తనకు సంబంధించి పార్టీలు బాధ్యత తీసుకోవాలని, ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లు జాగ్రత్త వహించాలని ECI పేర్కొంది. ఎన్నికల సీజన్ ప్రారంభంలో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే, బిజెపికి చెందిన దిలీప్ ఘోష్ కామెంట్స్ పై ఈసీ చర్యలు తీసుకుంది. అయితే, ఆ రెండు కేసుల్లోనూ… నేతలిద్దరూ కూడా తక్కువ స్థాయి వ్యక్తిగత దాడులు చేశారని తీర్పిచ్చింది. నోటీసుపై బిజెపి ఇంకా స్పందించనప్పటికీ, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పోల్ ప్యానెల్‌పై విరుచుకుపడ్డారు. “ప్రధానమంత్రి, హోం మంత్రి విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని సెటైర్ వేశారు. ఎన్నికల కమిషన్, ఏడు దశల ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ, ప్రచార సమయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులతో లక్ష్మణరేఖ దాటొద్దని రాజకీయ నాయకులను హెచ్చరించింది.