Home Page SliderTelangana

ప్రధాని మోదీ మనసంతా తెలంగాణానే..!

Share with

తెలంగాణపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టుగా కన్పిస్తోంది. తెలంగాణలో బీజేపీ భారీగా సీట్లు గెలుచుకుంటుందన్న నమ్మకంతో పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోనూ ఉత్తర తెలంగాణలోనూ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే రెండు సార్లు పర్యటించగా, తెలంగాణలో ఈనెల 8,10 తేదీల్లో మరోసారి ప్రచారంలో పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈనెల 8న వేములవాడ, వరంగల్ సభల్లో ప్రధాని పాల్గొంటారు. 10న మహబూబ్ నగర్ తోపాటుగా, ఎల్బీ స్టేడియంలో జరిగే సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలుగుప్పిస్తున్నారు. తెలంగాణలో వసూళ్లను ఢిల్లీకి కప్పం కడుతున్నారని, ఆర్ఆర్ ట్యాక్స్ ‌తో దోచేసుకుంటున్నారని తెలంగాణ పర్యటనలో మోదీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలన్న మోదీ, రుణమాఫీ, వరికి బోనస్ ఏం చేశారని ప్రశ్నించారు. ఫేక్ వీడియో అంశంలో డబుల్ ఆర్ పేరుందంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆక్షేపించారు. అత్యున్నతమైన రాజ్యాంగపదవిలో ఉన్నవారు ఇలాంటి చర్యలు చేయొచ్చా అంటూ నిలదీశారు.

బీజేపీ తెలంగాణలో కనీసం పది స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాదిలో ఈసారి పార్టీకి సీట్లు అంతంత మాత్రంగానే వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాని మోదీ తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ సాగుతోందన్న సర్వేల అంచనాలతో బీజేపీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.