Andhra PradeshHome Page Slider

టీడీపీతో పొత్తు అందుకే పెట్టుకున్నాం… అసలు విషయం చెప్పిన అమిత్ షా

Share with

టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి వెనుక ఉన్న కారణాలను వివరించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. దేశ వ్యాప్తంగా హిందీ కోసం పనిచేస్తున్న బీజేపీ, ఏపీలో తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు పొత్తు పెట్టుకుందట. హిందూపురం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కోసం ప్రచారం నిర్వహించిన అమిత్ షా జగన్ సర్కారు తెలుగు భాషను దెబ్బతీసిందన్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి, జగన్ తెలుగు భాషను దెబ్బతీశారన్నారు. తాము తెలుగు భాషను అంతం కానీయబోమన్నారు. అంతే కాదు అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే పొత్తు పెట్టుకున్నామన్నారు.

కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు. అవినీతి కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చేస్తున్నారన్నారు. ఏపీలో ల్యాండ్ మాఫియా అంతం కోసమే తాము పొత్తు పెట్టుకున్నామన్నారు. గుండాగిరీ, అవినీతిని అంతం చేయడానికి తమ పొత్తు అని చెప్పారు. తాము అవినీతి, మత మార్పిడులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు మద్దతిస్తున్నామన్నారు. ఏపీలో కూటమిని గెలిపిస్తే పోలవరం, హంద్రీ-నీవా, వెలిగొండ సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. మోదీని మళ్లీ ప్రధానిని చేయడమంటే నక్సలిజాన్ని, ఉగ్రవాదాన్ని అంతం చేయడమేనన్నారు.