Home Page SliderNational

పార్లమెంట్ ప్రారంభోత్సవంపై రగడ-బహిష్కరించిన విపక్షాలు

Share with

ఈ నెల 28న ప్రారంభోత్సవం కాబోతున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగడంపై రగడ మొదలయ్యింది. దీనిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాము ఈ ప్రారంభోత్సవానికి హాజరు కాబోమని తెగేసి చెప్తున్నాయి. రాజ్యాంగఅధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభిస్తే వస్తామని అంటున్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్ష పార్టీలు ప్రకటన విడుదల చేశాయి. పార్లమెంటులో విపక్షాల గొంతులను అణగదొక్కుతున్నారని, ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నప్పుడు ఎంపీలను అనర్హతకు గురిచేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తమకు కొత్త పార్లమెంట్ భవనంలో విలువలు కనిపించడం లేదంటున్నారు.

ఇక తెలంగాణాకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఆపార్టీ పార్లమెంటరీ నేత కె. కేశవరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించిన పార్టీలలో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన, సీపీఎం, ఆర్జేడీ వంటి అగ్ర పార్టీలు ఉన్నాయి. అయితే ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందని బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు. ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్ అనుబంధ భవనాన్ని ప్రారంభించారని, రాజీవ్ గాంధీ పార్లమెంట్ గ్రంథాలయాన్ని ప్రారంభించారని, అప్పుడు తప్పు కానిది ఇప్పుడు తప్పయ్యిందా అని విమర్శిస్తున్నారు.