Home Page SliderNational

గంగకు పుష్కరశోభ- తెలుగు ప్రజలతో క్రిక్కిరిసిన కాశీ

Share with

 హిందువులు అతి పవిత్రంగా పాటించే గంగానదికి పుష్కరాల పండుగొచ్చింది. పన్నెండేళ్లకొకసారి వచ్చే ఈ పుష్కరాల వేడుకతో గంగమ్మ కొత్తశోభ సంతరించుకుంది. హిందువుల పవిత్ర గ్రంధాలైన రామాయణ మహా భారతాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది గంగానది. గంగానదికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హిందువుగా పుట్టిన ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా వారి జీవితంలో గంగాస్నానం చేయాలనే నానుడి ఉంది.  ‘నమామి గంగే’ అంటూ భక్తకోటి కాశీలో పులకరించిపోతోంది.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో అంతర్వాహినిగా ప్రవహిస్తోంది గంగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి. గంగ దివ్యత్వాన్ని వేదాలు కూడా కీర్తించాయి. పరమేశ్వరుని శిరస్సుపైనే స్థానం సంపాదించుకుంది గంగ. ప్రాచీన మునులు, ఋషులు గంగా తీరాలలో తపస్సులు చేసి తరించారు.

ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ గంగా పుష్కరాల ప్రాశస్తాన్ని గురించి భారతీయులకు సందేశాన్ని అందించారు. ప్రత్యేకించి తెలుగువారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు మోదీ. తెలుగువారు కాశీతో ఆత్మీయ బంధాన్ని పెనవేసుకున్నారని ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శ్రీశైలం, వేములవాడ దేవాలయాల గురించి ప్రస్తావించారు.  ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో  పుష్కరాల కోసం అత్యంత వైభవంగా నెలరోజుల ముందు నుండి అనేక ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. పుష్కర స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని దేశ ప్రజల విశ్వాసం.