Breaking NewsHome Page Sliderhome page sliderInternational

శ్రీలంకలో ఇరాన్‌ నౌకపై దాడి.. 101 మంది గల్లంతు!

శ్రీలంక దక్షిణ తీరంలో సముద్ర విపత్తు సంభవించింది. ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామిలో జరిగిన దాడిలో 101 మంది గల్లంతయ్యారని, మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు 30 మందిని సురక్షితంగా రక్షించినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హేరత్ పార్లమెంటులో ధృవీకరించారు. హిందూ మహాసముద్రంలోని జలాల్లో, శ్రీలంక ప్రాదేశిక సరిహద్దుల వద్ద ఈ ఘటన జరగడం ఉత్కంఠకు దారితీస్తోంది. నౌక నుంచి అత్యవసర సహాయం కోరుతూ సంకేతాలు అందిన వెంటనే శ్రీలంక నావికాదళం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఈ రహస్య జలాంతర్గామి దాడి వెనుక ఉన్నది ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో, హిందూ మహాసముద్రం వరకు ఈ ఉద్రిక్తతలు పాకడం గమనార్హం. దాడులకు గురైన నౌక వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నదా లేదా సైనిక అవసరాల కోసమా అనే దానిపై ఇరాన్ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సముద్ర గర్భం నుంచి అకస్మాత్తుగా జరిగిన ఈ దాడి, సముద్ర భద్రతా సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నావికా దళం కూడా తమ నౌకపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకవేళ ఇది ఇజ్రాయెల్ లేదా దాని మిత్రదేశాల పని అని తేలితే, హిందూ మహాసముద్ర ప్రాంతంలో కూడా కొత్త యుద్ధ రంగం తెరుచుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం శ్రీలంక నావికాదళం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.