తెలంగాణలో జనసేన పోటీ ఖాయం: పవన్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ ముగిసింది. గచ్చిబౌలిలో జరగాల్సిన ‘జనసేన సాధక్ సమ్మేళనం’ సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఆయన మీడియా వేదికగా తన గళాన్ని వినిపించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ కేవలం పార్కింగ్, శాంతిభద్రతల సమస్యలను సాకులుగా చూపిస్తూ సభను అడ్డుకోవడంపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో అదే వేదికపై ఎన్నో కార్యక్రమాలకు లేని ఇబ్బంది ఇప్పుడే ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ తెలంగాణ ప్రజలను కానీ, ఇక్కడి నేతలను కానీ తక్కువ చేసి మాట్లాడలేదని స్పష్టం చేశారు. గతంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినప్పుడు రాని ప్రాంతీయ సెంటిమెంట్లు, ఇప్పుడు సభ పెడితేనే ఎలా గుర్తొస్తాయని మండిపడ్డారు.
కొన్ని స్వార్థ శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని పవన్ హెచ్చరించారు. తెలంగాణ గడ్డపై జనసేన ఉనికి ఎప్పటికీ ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని భవిష్యత్తు పొలిటికల్ రోడ్‌మ్యాప్‌ను తేల్చి చెప్పారు. ఈ సభను అడ్డుకోవడం వెనుక అధికార పక్షాల రాజకీయ కుట్ర దాగి ఉందని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.

