Home Page SliderTelangana

రేవంత్‌కు లోక్‌సభ సవాల్, మహబూబ్ నగర్ అసలైన అగ్నిపరీక్ష

Share with

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఎవరికి ఎన్ని అంచనాలున్నప్పటికీ గ్రౌండ్ సిచ్యూవేషన్ మాత్రం స్పష్టంగా వెల్లడవుతోంది. 17 స్థానాలకు మే 13న జరగనున్న ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 గెలవాలని చూస్తుంటే, బీజేపీ సైతం అదే నెంబర్ చెబుతోంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం 8 నుంచి 12 స్థానాల్లో పార్టీకి అవకాశాలున్నాయంటోంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ నియోజకవర్గం ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్టుగా సంక్షేమ పథకాలు పార్టీని గట్టెక్కిస్తాయా లేదంటే అనవసరమైన సమస్యలు సృష్టిస్తాయా అన్న చర్చ సాగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఐదు నెలల తర్వాత జరగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ విజయం అంత వీజీయేం కాదు. 17 స్థానాల్లో కేవలం ఐదు స్థానాల్లోనే పార్టీ సునాయాసంగా గెలిచే అవకాశమున్నట్టుగా వార్తలొస్తున్నాయ్. ఇతర సెగ్మెంట్లలో బీజేపీ దూసుకొస్తోందన్న ప్రచారం జరుగుతోంది. లేదంటే ఆ పార్టీ గట్టి పోటీనిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత భారత రాష్ట్ర సమితి ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. ఇది కాంగ్రెస్‌ పార్టీని కలవరపెడుతోంది. ఎన్నికలకు ముందుగానే BRS ఓటమి ఖరారయ్యిందన్న భావన ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ అన్నట్టుగా సీన్ ఉంది. సర్వేలు, గ్రౌండ్ రిపోర్టుల ప్రకారం ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న భావన ఉంది. 2019లో బీజేపీ గెలిచిన 4 స్థానాలను తిరిగి గెలుచుకోవాలని కాషాయ పార్టీ భావిస్తోంది. కరీంనగర్, సికింద్రాబాద్‌, నిజామాబాద్ గెలుపుపై దీమా ఉన్నప్పటికీ, ఆదిలాబాద్ విషయంలో స్పష్టత కరువవుతోంది. చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మల్కాజ్‌గిరి, జహీరాబాద్‌, వరంగల్‌, భువనగిరి.. ఏడు సీట్లలో ఫలితంపై ఉత్కంఠం నెలకొంది. హైదరాబాద్ లో మరోసారి మజ్లిస్ గెలుపు గురించి చర్చ అక్కర్లేదు. ఏడు స్థానాల్లో చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, జహీరాబాద్‌, మల్కాజిగిరిలలో బీజేపీకి అవకాశం ఉందని చెబుతుంటే, భువనగిరి, వరంగల్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. మెదక్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోరు ఉంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి. అసమ్మతి కోసం నేతలు వేచి చూస్తున్నట్టుగా కన్పిస్తోంది. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు, ఎంపీ ఎన్నికల్లో ఫలితాల తర్వాత జూలు విదిల్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ స్కోర్ పది కంటే తక్కువ వస్తే, ఏదైనా ప్రతికూలత జరగొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. రేవంత్ వ్యతిరేకుల అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. అసమ్మతి రాజేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను కొందరు నేతలు చూస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ లో పార్టీ ఓడితే అది ఆయన భవిష్యత్‌కు ఇబ్బంది కలిగిస్తుంది. సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్‌లో ఓడిపోవడం ఆయనపై శత్రువులు వాయిస్ రెయిజ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. కాంగ్రెస్‌ కంటే బీజేపీ 5 శాతం లీడ్ లో ఉన్నట్టుగా తాజా అంచనాలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో బీజేపీ మూడింటిలో ముందంజలో ఉంది. రెండు చోట్ల కాంగ్రెస్‌తో సమానంగా ఉంది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌తో సహా రెండు సెగ్మెంట్లలో మాత్రమే కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది. చాలా ఇతర నియోజకవర్గాల్లో మాదిరిగానే మహబూబ్‌నగర్‌లోనూ బీఆర్‌ఎస్‌ పతనం కావడం రేవంత్‌ రెడ్డికి ఇబ్బందిగా మారింది. BRS ఓట్ల శాతం దాదాపు సగానికి పడిపోయి 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. దీంతో బీజేపీ 40 శాతానికిపైగా, కాంగ్రెస్ 35 నుంచి 40 శాతానికి మధ్య ఉన్నట్టుగా అంచనాలున్నాయి. మహబూబ్ నగర్ లో ఓడిపోవడమంటే… ఢిల్లీలో రేవంత్ రెడ్డి పలుకుబడికి ముప్పు వాటిల్లుతుంది. బిజెపి తీవ్రంగా దాడి చేయడానికి అవకాశం ఇచ్చేనట్టే అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

మహబూబ్‌నగర్‌లో, కొన్ని ఇతర నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్గత స్పర్ధల కారణంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌తో కూడిన ఏడు సెగ్మెంట్లలో ఏకంగా మూడు లక్షల ఓట్ల ఆధిక్యంతో ఆ పార్టీ ఇప్పుడు ఓటమిని చవిచూస్తోంది. జాతీయ ఎన్నికలు కావడం, ప్రాంతీయ పార్టీలకు పొంతన లేకపోవడం, కాంగ్రెస్‌ నేతల్లో అత్యుత్సాహం లేకపోవడంతో ఓటర్లు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీకి మారడం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. అయితే రేవంత్ జరిగే ముప్పును పసిగట్టారు. ప్రస్తుతం జైల్లో ఉన్న కుమార్తె కవిత పట్ల ఢిల్లీ మద్యం కేసులో కేంద్రం మెతకగా వ్యవహరించేందుకు క్విడ్ ప్రోకోగా మహబూబ్ నగర్ సహా ఐదు నియోజకవర్గాల్లో బీజేపీకి సహాయం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కాషాయం పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఆరోపించారు. వరంగల్‌లో పోటీ కూడా కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే సాగుతోంది. ఇటీవల పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను కాంగ్రెస్‌ రంగంలోకి దింపింది. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు బీఆర్‌ఎస్ బీజేపీ అభ్యర్థికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. మొత్తంగా టార్గెట్ రేవంత్ రెడ్డిని ఇరుకునపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే, కాంగ్రెస్‌లోని చాలా మంది, రేవంత్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.