రోహిత్‌పై అక్మల్ ప్రశంసల జల్లు
భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ అద్భుత శతకం సాధించి విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ, రోహిత్ ఆడిన ఇన్నింగ్స్‌నే అసలైన హైలైట్‌గా అభివర్ణించిన అక్మల్.. ప్రపంచంలో అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో రోహిత్ ఒకడని పేర్కొన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను లేడనే ప్రచారాలకు ఈ సెంచరీతో గట్టి సమాధానం ఇచ్చాడని వ్యాఖ్యానించాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను ఎవరూ జట్టు నుంచి బలవంతంగా తప్పించలేరని, ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో వారికే బాగా తెలుసని అక్మల్ అభిప్రాయపడ్డాడు. మూడో వన్డేలో రోహిత్ కేవలం 110 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేసి తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ఊహాగానాలపై స్పందించిన రోహిత్.. ఇలాంటి ప్రచారాలపై తాను స్పందించనని, విమర్శలకు సమాధానం తన బ్యాట్‌తోనే ఇస్తానని స్పష్టం చేశాడు.
2024 టీ20 ప్రపంచకప్ అనంతరం టీ20లకు, తర్వాత టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ ప్రస్తుతం 2027 వన్డే ప్రపంచకప్‌పై పూర్తి దృష్టి సారించారు. తమ అనుభవంతో భారత జట్టుకు మరింత విజయాలు అందించాలనే లక్ష్యంతో ఇద్దరూ ముందుకు సాగుతున్నారు.

