Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

అరవ శ్రీధర్ కేసులో హైకోర్టుకు హర్షవీణ

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఎమ్మెల్యే తనను మోసం చేయడమే కాకుండా, తనపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ బాధితురాలు హర్షవీణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హర్షవీణ తరపున న్యాయవాదులు సాయిక్రిష్ణ, గల్లా సతీశ్ కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తూ, ఎమ్మెల్యే తన అధికార హోదాను అడ్డం పెట్టుకుని బాధితురాలిని తీవ్రంగా వంచించారని ధ్వజమెత్తారు.
తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ఎదురుతిరగడంతో, ఎమ్మెల్యే తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పోలీసు యంత్రాంగాన్ని ప్రభావితం చేశారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కావాలనే ఆమెపై తప్పుడు కేసులు పెట్టించి మానసిక వేధింపులకు, భయాందోళనలకు గురిచేస్తున్నారని వాదించారు. ఆమెపై నమోదైన కేసుల్లో ఎటువంటి వాస్తవం లేదని, కేవలం వేధించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. అధికార బలంతో ఒక మహిళను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హర్షవీణ తన పిటిషన్‌లో ఆరోపించారు. న్యాయం చేయమని కోరినందుకు ప్రతిగా అక్రమ కేసులతో తనను ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన తప్పుడు కేసులను తక్షణమే కొట్టివేసి, తనకు న్యాయం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఒక మహిళ నేరుగా హైకోర్టులో పోరాటానికి దిగడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.