క్రెడిట్ చోరీలో చంద్రబాబుది ప్రపంచ రికార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. “ఈ భూమండలంపై క్రెడిట్ చోరీని అత్యంత సమర్థంగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమేనని, అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈయన్ను చూసి సిగ్గుపడాల్సిందే,” అని వై ఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
భూముల రీసర్వే అనేది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహా యజ్ఞమని అభివర్ణించారు. 100 ఏళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా అత్యంత పారదర్శకంగా, వివాదాల్లేకుండా సర్వే నిర్వహించామని తెలిపారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2020 డిసెంబర్‌లో ఈ ప్రక్రియను ప్రారంభించామని, ఇందుకోసం 40 వేల మంది సిబ్బందికి అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణ ఇప్పించామన్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ల వినియోగంతో పాటు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసి కోట్ల సంఖ్యలో సర్వే రాళ్లను రైతులకు ఉచితంగా అందించామని, ఈ కృషిని గుర్తించి కేంద్రమే ప్లాటినం గ్రేడ్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నీరుగారుస్తోందని జగన్ ఆరోపించారు. తాము పాతిన సర్వే రాళ్లపై ఉన్న పేర్లను తొలగించేందుకు ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు చేస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకాలనే వాడుతూ కేవలం రంగు మార్చి తన ముద్ర వేసుకుంటున్నారని విమర్శించారు. ట్యాంపర్ చేయడానికి వీల్లేని పద్ధతిలో తాము పాస్ పుస్తకాలు ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇస్తున్న పుస్తకాల్లో విపరీతమైన తప్పులు దొర్లుతున్నాయని దుయ్యబట్టారు. 22ఏ నిషేధిత జాబితాలో అడ్డగోలుగా భూములను పెట్టిన చరిత్ర బాబుదని, కానీ తాము లక్షలాది మంది రైతులకు భూములపై శాశ్వత హక్కులు కల్పించామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఏపీలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సాల్మన్‌ను టీడీపీ వర్గీయులు అత్యంత కిరాతకంగా రాడ్లతో కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కూడా ఊరిలోకి రానివ్వని దుస్థితి నెలకొందని, ఈ అరాచకాల్లో పోలీసు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, సాక్షాత్తు చంద్రబాబు కూడా దోషేనని విమర్శించారు. ఈ ఘటనపై తాము కోర్టులను, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్ వాడవాడలా వెలిశాయని జగన్ ఆరోపించారు. మద్యం, ఇసుక, మైనింగ్ రంగాల్లో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇసుక ద్వారా ఖజానాకు రూ. 750 కోట్లు వచ్చేదని, ఇప్పుడు రేట్లు రెట్టింపు అయినా ఖజానాకు పైసా రావడం లేదని విమర్శించారు. సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలను నడిపించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. ఈ తతంగంతో సుమారు రూ.2 వేల కోట్ల రొటేషన్ జరిగింది. ఇందులో చంద్రబాబు, నేతలు, పోలీసులు కూడా వాటాలేసుకున్నారు. జూదం అనేది చట్టబద్దమా?. ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి వాటిని ప్రొత్సహించడమేంటి?. ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కిందకు రాదా?.. ఇది అవినీతి కిందకే వస్తుంది కదా.. లూటీ కదా!.. అని ఆయన ప్రశ్నించారు .
ప్రతిపక్ష హోదా అంశంపై వేసిన ప్రశ్నకు బదులిస్తూ, ఈ ప్రశ్నకు గతంలో చాలాసార్లు సమాధానం ఇచ్చామని వై ఎస్ జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో తాము తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేదనే విషయాన్ని మీడియా గుర్తించాలని, సభలో మైక్ ఇచ్చే పరిస్థితులు లేనందునే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోందని వైఎస్ జగన్ అన్నారు.
అమరావతి నిర్మాణాల పేరుతో జరుగుతున్నది కేవలం స్కామ్ మాత్రమేనని, నిర్మాణ ఖర్చుల పేరుతో ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

