Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

యువతకు చంద్రబాబు ‘వెన్నుపోటు’..

తాడేపల్లి :జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా సోమవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యువత ఏకాగ్రత , లక్ష్యంతో కృషి చేస్తేనే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని గుర్తు చేసిన ఆయన, నేడు రాష్ట్రంలో యువత అందుకు భిన్నంగా అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని, గత ఎనిమిది త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో విద్యా దీవెన కింద రూ. 4,900 కోట్లు, వసతి దీవెన కింద రూ. 2,200 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని జగన్ వెల్లడించారు. ఈ నిధులు అందకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులను నిలిపివేయడం యువత నైపుణ్యాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇటువంటి విధానాలు యువత తమ లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని జగన్ మోహన్ రెడీ ఆరోపించారు. నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని దుయ్యబట్టారు. ఇది యువతను నిలువునా వంచించడమేనని, మేనిఫెస్టో వాగ్దానాలను ఉల్లంఘించి చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టకుండా అవసరమైన సహకారం అందించాలని డిమాండ్ చేశారు.
స్వామి వివేకానందుడి ప్రముఖ సూక్తిని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ హితవు పలికారు. “మేల్కొనండి, సోమరితనాన్ని వీడండి, యువతకు సహకరించండి,” (Arise, Awake, and facilitate..) అంటూ హితబోధ చేశారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి, నిరుద్యోగ యువతకు మరియు విద్యార్థులకు అందాల్సిన ఆర్థిక సహకారాన్ని తక్షణమే అందజేయాలని, వారి కలలను నిజం చేసుకునేందుకు మార్గం సుగమం చేయాలని మాజీ సీఎం ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.