ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
అమరావతి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా, క్షేత్రస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించే పలువురు జూనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పలుమార్లు బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా యువ అధికారులకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను ,కీలక శాఖలకు అధికారులను నియమించింది.
ఈ బదిలీల ప్రకారం, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కల్పన కుమారి, విశాఖపట్నం జేసీగా గొబ్బిళ్ళ విద్యాధరి, చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్ నియమితులయ్యారు. అదేవిధంగా పల్నాడు జిల్లాకు వి. సంజనా సిన్హా , అనకాపల్లికి మల్లవరపు సూర్యతేజ, అన్నమయ్య జిల్లాకు శివ నారాయణ శర్మ జాయింట్ కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. మార్కాపురం జేసీగా పి. శ్రీనివాసులు, అనంతపురం జేసీగా సి. విష్ణు చరణ్‌ను ప్రభుత్వం నియమించింది.
మున్సిపల్ , ఇతర కీలక విభాగాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా ఆర్. గోవిందరావు నియమితులయ్యారు. సివిల్ సప్లై డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా రోణంకి గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించనుండగా, గిరిజన సహకార సంస్థ ఎండీగా ఎస్.ఎస్. శోబికకు బాధ్యతలు అప్పగించారు.
ఈ బదిలీలలో వైఎస్ఆర్ కడప జిల్లా నియామకం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా నియమితులయ్యారు. విశేషమేమిటంటే, ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న నచికేత్ విశ్వనాథ్ ఆమె భర్త కావడంతో, ఒకే జిల్లాలో భార్యాభర్తలు రెవెన్యూ , పోలీస్ విభాగాల్లో అత్యున్నత హోదాల్లో ఉండటం విశేషం. పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే ఈ బదిలీల ప్రధాన ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

