సీఎం ఒక విప్లవకారుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సామాజిక వైద్యుడని, అట్టడుగు వర్గాలకు న్యాయం చేస్తున్న గొప్ప ‘సామాజిక విప్లవకారుడు’ అని నాగర్ కర్నూలు ఎంపీ, కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం చైర్మన్ డాక్టర్ మల్లు రవి కొనియాడారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, పాలనా విధానాలపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం సామాజిక న్యాయం అమలవుతోందని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటి గడప తడుతున్నాయని మల్లు రవి పేర్కొన్నారు. ప్రజలంతా ప్రస్తుత పాలనలో అత్యంత సంతోషంగా ఉన్నారని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెబుతూ.. ఆయన పాలన వందేళ్ల పాటు సాగాలని ఆకాంక్షించారు.రాష్ట్ర రాజకీయాలపై విశ్లేషిస్తూ.. తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిందని మల్లు రవి విమర్శించారు. “అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరియు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ప్రజలు ఆ పార్టీని పూర్తిగా విస్మరించారు” అని అన్నారు.
బీజేపీపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణ అభివృద్ధికి నయాపైసా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని, రాష్ట్రంలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు.

