విద్యార్థుల కోసం హెడ్ మాస్టార్ ఏం చేశారంటే..
గురువు అంటే సాక్షాత్తూ పరబ్రహ్మః అనే సంస్కృతి మనది. అలాంటిది ఇటీవల టీచర్లపై విద్యార్థులకు ఏమాత్రం గౌరవమర్యాదలు ఉండడం లేదు. కొందరు గురువులు స్వార్థంతో పనిచేసినా, చాలామంది విద్యార్థుల మంచి కోసమే కష్టపడుతుంటారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఒక పాఠశాలలో జరిగిన సంఘటన టీచర్ల గొప్పతనాన్ని తెలియజేస్తోంది. విద్యార్థులు శ్రద్ధగా చదవడం లేదని, సమయం వృధా చేస్తున్నారని ఆవేదన చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏం చేశారో తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి. విద్యార్థులను కొట్టడం, తిట్టడం నేరం. కానీ వారు భయభక్తులు లేకుండా అల్లరచిల్లరగా తిరుగుతూ చదువును అశ్రద్ధ చేస్తూంటే చూస్తూ ఊరుకోలేరు ఉపాధ్యాయులు. వారి బాధ్యతను విస్మరించలేరు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యుడు ఇలాగే బాధతో ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులందరి ముందూ గుంజీలు తీసి, సాష్టాంగపడి క్షమాపణలు చెప్పారు. విద్యార్థులు చదవక పోవడానికి తప్పెవరిది? అని ప్రశ్నించాడు. విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్ లేవు, రైటింగ్ స్కిల్స్ లేవు, ఎవరూ సరిగా చదవడం లేదంటూ బాధను వ్యక్తం చేశారు. తమ ఉపాధ్యాయులందరూ విద్యార్థుల కోసం ఎంతో కష్టపడుతున్నామని, తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చదువుకునే వయసులో శ్రద్ధగా చదువుకోవాలని హితవు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు కూడా మారాలని, పిల్లలను అతిగారాబం చేయడం, వారికి బుద్ది చెప్పబోయిన టీచర్లను వేధించడం వంటి పనులు చేయకూడదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.