మెటా సంచలన నిర్ణయం: 8,000 మంది ఉద్యోగులపై వేటు!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా టెక్ ప్రపంచంలో మరోసారి భారీ లేఆఫ్స్‌తో ప్రకంపనలు సృష్టించింది. సంస్థాగత మార్పులలో భాగంగా తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి దాదాపు 10 శాతం మందిని, అంటే 8,000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే, ఈ లేఆఫ్స్ ప్రక్రియను చేపట్టిన విధానం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
కంపెనీ తన ఉద్యోగులందరినీ ఆ రోజు ఆఫీసుకు రాకుండా, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆదేశించింది. ఆ తర్వాత, తెల్లవారుజామున 4 గంటలకే ఉద్యోగాల తొలగింపునకు సంబంధించిన ఈమెయిల్స్ పంపడం గమనార్హం. ఈ ఆకస్మిక నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుత ఉద్యోగులతో పాటు భర్తీ చేయాలనుకున్న మరో 6,000 ఓపెన్ రోల్స్‌ను కూడా కంపెనీ రద్దు చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, సంస్థ నిర్మాణాన్ని మరింత సరళంగా మార్చడమే దీనికి ప్రధాన కారణమని మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జనెల్ గేల్ అంతర్గత మెమోలో పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకే ఈ ఖర్చుల కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది.
బాధిత అమెరికా ఉద్యోగులకు 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, వారు పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల జీతాన్ని పరిహారంగా ఇవ్వనున్నట్లు మెటా ప్రకటించింది.

