మోదీ-మెలోని ‘మెలోడీ’ వీడియో మహిమ.. 5% పెరిగిన పార్లే స్టాక్!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీల ‘మెలోడీ’ వైరుధ్యం సోషల్ మీడియాలోనే కాకుండా స్టాక్ మార్కెట్లోనూ విచిత్రమైన కలకలం రేపింది. ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో మెలోనికి ‘మెలోడీ’ చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇవ్వడం, దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడం తెలిసిందే.
అయితే, ఈ వైరల్ వీడియో చూసి ఇన్వెస్టర్లు తొందరపడి స్టాక్ మార్కెట్లో ఒక భారీ పొరపాటు చేశారు. మెలోడీ చాక్లెట్లను తయారు చేసేది స్టాక్ మార్కెట్లో లేని కంపెనీ అయిన ‘పార్లే ప్రొడక్ట్స్’. కానీ, కేవలం పేరులో ‘పార్లే’ అని ఉండటాన్ని చూసి, ఇన్వెస్టర్లు ఏమాత్రం సంబంధం లేని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టెడ్ కంపెనీ ‘పార్లే ఇండస్ట్రీస్’ షేర్లను ఎగబడి కొనుగోలు చేశారు.
దీంతో ఆ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ షేరు విలువ ఒక్కసారిగా 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కేవలం ఒక వైరల్ వీడియో వల్ల బిస్కట్లు, చాక్లెట్లతో అసలు సంబంధమే లేని పెన్నీ స్టాక్ పెరగడం చూసి మార్కెట్ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్ ఇన్వెస్టర్లను ఎంతలా తప్పుదారి పట్టిస్తాయనే దానికి ఈ ఘటనే నిదర్శనం

