BusinessHome Page SliderNationalNews Alert

టీసీఎస్ వేతన పెంపు.. ఉద్యోగుల్లో అసంతృప్తి!

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వార్షిక వేతన పెంపును అమలు చేసినప్పటికీ, అది ఉద్యోగుల్లో ఆనందానికి బదులు తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను కలిగిస్తోంది. కంపెనీ సగటున 5 శాతం జీతాలు పెంచినట్లు ప్రకటించినా, అంతర్గత నిబంధనల్లో మార్పులు, కఠినమైన పనితీరు కోటాల వల్ల చేతికి వచ్చే నికర ఆదాయం తగ్గిపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ప్రతిభ కనబరిచిన ‘A+’ పర్ఫార్మెన్స్ బ్యాండ్ ఉద్యోగులకు అత్యధికంగా 9శాతం నుండి 13శాతం వరకు ఇంక్రిమెంట్లు లభించాయి. అయినప్పటికీ, అంతర్గత వేతన నిర్మాణంలో చేసిన మార్పులు, పనితీరు ఆధారంగా ఇచ్చే వేరియబుల్ పే తగ్గడం వల్ల మెజారిటీ ఉద్యోగుల ఇన్-హ్యాండ్ శాలరీ తగ్గిపోయింది. కంపెనీ ఆఫర్ చేసే కాస్ట్ టు కంపెనీ (CTC) నుండి గ్రాట్యుటీ మొత్తాన్ని తొలగించి చూపిస్తున్నారు. ప్రతి టీమ్‌లో కనీసం 5 శాతం మంది సిబ్బందిని అత్యంత తక్కువ పనితీరు కేటగిరీ అయిన ‘బ్యాండ్ డి’ లో ఉంచాలని యాజమాన్యం అంతర్గత కోటాను విధించినట్లు సమాచారం. సాధారణంగా ఈ బ్యాండ్‌లోని ఉద్యోగులపై కంపెనీ వేటు వేసే (లే-ఆఫ్) అవకాశం ఉండటంతో, భవిష్యత్తులో తమ ఉద్యోగాలు ఊడిపోతాయేమోననే అభద్రతా భావం ఉద్యోగుల్లో తీవ్రస్థాయికి చేరింది. ఈ వివాదం కేవలం టీసీఎస్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం కారణంగా అంతర్జాతీయ క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్లను తగ్గించుకున్నారు. కొత్త ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ వృద్ధి మందగించడంతో, ఐటీ కంపెనీలు తమ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల వేతనాల్లో కోతలు, కఠినమైన పనితీరు నిబంధనలను తెరపైకి తెస్తున్నాయి.