Home Page SliderNationalPolitics

పీఎం మోదీ ఇటలీ పర్యటనపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..

దేశంపై తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని, ప్రజలు కష్టాల్లో అల్లాడుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో సరదాగా గడుపుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎం మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి “మెలొడీ” చాక్లెట్లు బహుమతిగా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు.

“మన దేశంపై ఆర్థిక తుఫాను ముంచుకొస్తోంది, కానీ మన ప్రధానమంత్రి మాత్రం ఇటలీకి వెళ్లి చాక్లెట్లు పంచుతున్నారు! ఇక్కడ రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పీఎం మాత్రం నవ్వుతూ రీల్స్ చేసుకుంటున్నారు, బీజేపీ శ్రేణులు చప్పట్లు కొడుతున్నారు. ఇది బాధ్యతాయుతమైన నాయకత్వం కాదు, ఒక నాటకం.”

దేశ ప్రజలను పొదుపు పాటించాలని, ఇంధన వాడకం తగ్గించి, విదేశీ ప్రయాణాలు మరియు బంగారం కొనడం ఆపేయాలని సలహాలు ఇచ్చిన ప్రధాని.. తానేమో వేల కోట్ల విలువైన విమానాల్లో విదేశీ పర్యటనలు చేయడం ఏంటని రాహుల్ ప్రశ్నించారు.

మరోవైపు ఈ విమర్శలపై అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. పీఎం మోదీ పర్యటనల వల్ల దేశానికి వస్తున్న అంతర్జాతీయ పెట్టుబడులను, ప్రపంచ దేశాలలో నిరంతరం పెరుగుతున్న భారతదేశ ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరియు ఇతర బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.