Home Page SliderNewsTelanganatelangana,

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: ఉద్యోగుల బకాయిలకు రూ. 2000 కోట్లు విడుదల

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఎన్నికల వేళ ఉద్యోగ సంఘాల జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల కోసం మొదటి విడతగా రూ. 2,000 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది.

డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల విడుదలతో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలు 100 శాతం క్లియర్ అయ్యాయి. అలాగే, మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నీ పూర్తిగా చెల్లించినట్లయింది.

మొత్తం రూ. 6,000 కోట్ల బకాయిలను 100 రోజుల్లోగా చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. పక్కా ప్రణాళికతో మిగిలిన రూ. 4,000 కోట్లను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.