సిద్ధరామయ్య సంచలన నిర్ణయం: ఢిల్లీ వద్దు.. బెంగళూరే ముద్దు!
కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ రాజీనామా అనంతరం ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో పెద్ద పీట వేయాలని భావించింది. ఆయనకు గౌరవప్రదమైన ‘రాజ్యసభ’ సీటుతో పాటు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను ఆఫర్ చేసింది. కానీ, సిద్ధరామయ్య ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.
తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాజకీయాల నుండి రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని, తన శ్వాస ఉన్నంతవరకు కన్నడ గడ్డపైనే ప్రజల కోసం పనిచేస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును కోల్పోకుండా ఉండటానికి, స్థానిక నాయకత్వానికి మరియు తన అనుచరులకు అండగా నిలవడానికే ఆయన ఢిల్లీ కంటే బెంగళూరుకే ప్రాధాన్యత ఇచ్చారు.
సిద్ధరామయ్య రాజీనామా లేఖను కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అధికారికంగా ఆమోదించారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు సిద్ధరామయ్యను కేర్‌టేకర్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. ప్రస్తుత మంత్రివర్గాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో చర్యలు వేగంగా అమలువుతున్నాయి. గతంలో కుదిరిన అధికార పంపకాల ఒప్పందం ప్రకారం, ప్రస్తుత డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమమైంది.కొత్త ముఖ్యమంత్రిని అధికారికంగా ఎన్నుకునేందుకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలందరూ నగరంలోనే అందుబాటులో ఉండాలని అధిష్టానం హై అలర్ట్ జారీ చేసింది
రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించేందుకే సిద్ధరామయ్య బెంగళూరులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

