ఇక్కడ చేస్తున్న దోపిడి చాలడం లేదా? కవితకు ఈటల కౌంటర్
ఇక్కడ దోపిడీ సరిపోదు అన్నట్టుగా… ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలి? ఇక్కడ సరిపోతలేదా? అంటూ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శించారు. ఇక్కడ ధరణి పేరిట వేలాది ఎకరాల భూములను చరబట్టి, పేదల భూములను మాయం చేసి వేలకోట్ల రూపాయలు సంపాదించారన్నారు ఈటల. తెలంగాణ ప్రజలారా 2014 వరకు అటుకులు బుక్కి, ఉపాసముండి ఉద్యమాలు నడిపిన పార్టీ మాది అని కేసీఆర్ చెప్పేవారని ఈటల గుర్తు చేశారు. 2014 తర్వాత వేల కోట్ల రూపాయలు ఉప ఎన్నికలలో ఖర్చు పెట్టి, ఓట్లను కొనుక్కునే స్థాయికి ఎలా వచ్చారు? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరికైనా డబ్బులు ఊరికినే ఇస్తారా? అని ఈటల ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తాతజాగీర్ లాగా ఇక్కడ నుండి వేల కోట్ల రూపాయలు పంపించి.. తెలంగాణ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తుంది ఎవరని? కేసీఆర్‌పై తీవ్రంగా ఈటల మండిపడ్డారు.

