విశాఖ టూరిజంలో సరికొత్త విప్లవం
‘రాపిడో’ డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్లు!
విశాఖపట్నం పర్యాటక రంగాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఒక వినూత్నమైన అడుగు వేసింది. ప్రముఖ బైక్ టాక్సీ సంస్థ ‘రాపిడో’తో టూరిజం శాఖ ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ వినూత్న ఒప్పందం ప్రకారం.. రాపిడో డ్రైవర్లు కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా, నగరానికి వచ్చే పర్యాటకులకు ‘టూరిస్ట్ గైడ్’లుగా కూడా సేవలు అందించనున్నారు. ఇందుకోసం రాపిడో ప్రతినిధులకు విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశేషాలు, వాటి చారిత్రక ప్రాధాన్యతపై టూరిజం శాఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఇకపై పర్యాటకులు రాపిడో బైక్ లేదా ఆటో ఎక్కినప్పుడు, వారు సందర్శించే ప్రాంతాల విశిష్టతను ఈ ‘డ్రైవర్ కమ్ గైడ్లు’ క్షుణ్ణంగా వివరించనున్నారు. ఈ సరికొత్త స్మార్ట్ టూరిజం సేవల కోసం తొలి విడతగా 350 మంది రాపిడో డ్రైవర్లను ప్రత్యేక శిక్షణతో అధికారులు సిద్ధం చేశారు. వీరంతా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు అధికారికంగా రంగంలోకి దిగారు. విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ వినూత్న సేవలకు లభించే ఆదరణను బట్టి, రాబోయే రోజుల్లో విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన పర్యాటక నగరాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. రాపిడో సంస్థతో టూరిజం శాఖ చేసుకున్న ఈ భాగస్వామ్యం విశాఖకు వచ్చే పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతమైన, వినూత్నమైన ప్రయాణ అనుభూతిని అందించనుంది. సాధారణంగా కొత్త ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు గైడ్ల కోసం ప్రత్యేకంగా వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతోనే రవాణా, గైడ్ సేవలు ఒకేచోట లభిస్తాయి. ఇది నగర టూరిజం ప్రమోషన్‌కు పెద్ద బూస్ట్ ఇవ్వడమే కాకుండా, పర్యాటక రంగంలో సరికొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేయనుంది.

