ఇవాంకా హత్యకు ఉగ్ర కుట్ర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను హతమార్చేందుకు జరిగిన ఒక భారీ అంతర్జాతీయ ఉగ్ర కుట్రను అమెరికా భద్రతా సంస్థలు భగ్గుం చేశాయి. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్-ఇరాక్ ఉగ్ర నెట్‌వర్క్‌తో సంబంధాలున్న మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ (32) అనే ఇరాక్ ఉగ్రవాది ఈ ఘాతుకానికి వ్యూహరచన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు జరిగిన డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్, ఖుద్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానీ హతమయ్యాడు. ఆ నాటి ఆపరేషన్‌కు ప్రతీకారంగా ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇవాంకాను అంతమొందించాలని నిందితుడు అల్ సాదీ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఫ్లోరిడాలోని ఆమె విలాసవంతమైన నివాసానికి సంబంధించిన బ్లూప్రింట్లు, రహస్య భద్రతా వివరాలను సేకరించి, ఇవాంకా ఇంటి చుట్టుపక్కల నిందితుడు రెక్కీ కూడా నిర్వహించినట్లు భద్రతా విభాగాలు గుర్తించాయి. అంతేకాకుండా ఆ నివాస చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు సమాచారం. సులేమానీ మరణం తర్వాత అల్ సాదీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని, ట్రంప్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకుంటానని బహిరంగంగానే హెచ్చరించాడని మాజీ ఇరాకీ మిలిటరీ అధికారి ఆంటిఫాద్ కన్బార్ వెల్లడించారు. నిందితుడు తన ప్రణాళిక అమలు చేసే లోపే కొంతకాలం క్రితం టర్కీలో దొరికిపోగా, అక్కడి నుంచి అతడిని అమెరికాకు తరలించి విచారించడంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుట్ర వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తులు, ఉగ్ర ముఠాల లింకులపై అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఇరాన్‌తో అమెరికాకు తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కుట్ర బట్టబయలు కావడంతో వైట్ హౌస్ అప్రమత్తమైంది. ఇవాంకా ట్రంప్‌తో పాటు అధ్యక్షుడి కుటుంబ సభ్యులందరికీ భద్రతను మరింత పకడ్బందీగా కట్టుదిట్టం చేశారు.

